మా నీరే వాడుకుంటాం

ABN , First Publish Date - 2020-06-18T08:21:21+05:30 IST

కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌-1 ఆదేశాలకు లోబడే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది...

మా నీరే వాడుకుంటాం

  • కేటాయింపులకు మించి వినియోగించట్లేదు
  • ట్రైబ్యునల్‌ ఆదేశాలకు లోబడే‘రాయలసీమ ఎత్తిపోతల’
  • తెలంగాణ నిర్మించేవన్నీ కొత్త ప్రాజెక్టులే
  • కేఆర్‌ఎంబీ ముందు ఏపీ వాదన

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌-1 ఆదేశాలకు లోబడే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది.  దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడంలో సహేతుకత లేదని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ) ముందు వాదన వినిపించింది. ఆ పథకం కోసం అదనంగా జలాలను వినియోగించడంలేదని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులన్నీ కొత్తవేనని తెలిపింది. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ 12వ సమావేశం మినిట్స్‌ను మంగళవారం తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ పంపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌ను అభివృద్ధి చేయడం, 800 అడుగుల ఎత్తులోనే నీటిని తోడేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందంటూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఏపీ తిప్పికొట్టింది.


తెలంగాణ అభ్యంతరం అర్థరహితం..

ట్రైబ్యునల్‌-1 ఆదేశాలకు లోబడి నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థరహితమని ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పేర్కొన్నారు. కేటాయింపులకు లోబడి జలాలు వినియోగించుకుంటే తెలంగాణకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఏపీకి కేటాయించిన జలాలను మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆదిత్యనాథ్‌ ఆరోపించారు.


నీటి కొట్లాటలతోనే తెలంగాణ ఆవిర్భావం..

ఏపీ వాదనను తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వ్యతిరేకించారు. దశాబ్దాలుగా నదీ జలాల కోసం చేసిన కొట్లాటతోనే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఆరేళ్ల తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 80,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేలా ప్రాజెక్టులు నిర్మిస్తూ, సక్రమమేనని ఏపీ వాదించడం ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణలోని ఆయకట్టుకు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అవన్నీ భయాందోళనలు మాత్రమేనని ఆదిత్యనాథ్‌ దాస్‌ పేర్కొన్నారు.


తెలంగాణలో 8 కొత్త ప్రాజెక్టులు..

రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ సర్కారు ఎనిమిది కొత్త ప్రాజెక్టులు.. నిర్మిస్తోందంటూ ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంపైనా తెలంగాణ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది.  గుండ్రేవుల ప్రాజెక్టు కూడా కొత్తదేనని ఆరోపించింది. గాజులదిన్నె ఎత్తిపోతలకు జలాలను అదనంగా అందిస్తున్నారని ఆరోపించగా, అలాంటి పథకమేలేదని ఏపీ స్పష్టం చేసింది. పులికనుమ, సిద్దాపురం, శివభశ్యం, ముచ్చుమర్రి పాతవేనని తెలిపింది. 

‘హరిశ్చంద్రపురం’పై చర్చ ఉపసంహరణ..

గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ఫేజ్‌-1లో భాగంగా హరిశ్చంద్రపురం వద్ద నిర్మించే ప్రాజెక్టుకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని ఏపీ వివరించడంతో, దీనిపై చర్చను ఉపసంహరించుకుంటున్నట్లు కేఆర్‌ఎంబీ ప్రకటించింది.


నేడు పట్టిసీమ నీరు విడుదల

పోలవరం/పెదవేగి : పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు నీటిని విడుదల చేయనున్నట్టు పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఎస్‌ఈ వీరకుమార్‌  తెలిపారు. ట్రయల్‌ రన్‌గా తొలుత ఆరు మోటార్లు, మూడు పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం కాలువ వెంబడి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అని ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించారు.


Updated Date - 2020-06-18T08:21:21+05:30 IST