దారిమళ్లిన రేషన్‌ బియ్యం!

ABN , First Publish Date - 2020-04-28T09:36:16+05:30 IST

పేదలకు సాయం చేయాలంటే ఎవరైనా జేబులో సొమ్ము తీసి ఖర్చు చేస్తారు. కానీ, అధికార పార్టీ నాయకుల్లో కొందరి తీరు ‘సొమ్మొకరిది...

దారిమళ్లిన రేషన్‌ బియ్యం!

అనకాపల్లి ఎంపీ కల్యాణ మండపంలో అన్‌లోడ్‌

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీపీఎం కార్యకర్తలు

విచారణకు ఆదేశించిన జేసీ శివశంకర్‌


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం, అనకాపలి/అనకాపల్లి టౌన్‌): పేదలకు సాయం చేయాలంటే ఎవరైనా జేబులో సొమ్ము తీసి ఖర్చు చేస్తారు. కానీ, అధికార పార్టీ నాయకుల్లో కొందరి తీరు ‘సొమ్మొకరిది... సోకొకరిది’ అన్న చందంగా ఉంది. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి రేషన్‌ బియ్యాన్నే దారి మళ్లించి పంపిణీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆ భాగోతం బట్టబయలైంది.  పౌర సరఫరాల శాఖకు చెందిన ఎంఎల్‌ఎస్‌ గోదాము నుంచి అనకాపల్లిలోని ఓ డీలర్‌(గవరపాలెం)కు సరఫరా చేసిన బియ్యం లారీ సోమవారం రాత్రి అనకాపల్లి ఎంపీ కుటుంబ సభ్యులకు చెందిన కల్యాణ మండపం(వివేకానంద చారిటబుల్‌ ట్రస్టు, శారద సదన్‌...ఆమె నివాసం కూడా పక్కనే ఉంటుంది) వద్దకు వెళ్లింది. కొన్ని బియ్యం బస్తాలను కల్యాణ మండపంలోకి దింపేశారు.  లారీ ముందు భాగంలో ‘పౌర సరఫరాల శాఖ చౌక బియ్యం’ అని బ్యానర్‌ ఉంది.  సీపీఎం నాయకులు అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా, పట్టణ రేషన్‌ డీలర్ల సంఘం నాయకుడు వచ్చి వివాదాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ‘ఎంపీ సత్యవతి...కొంత మేరకు బియ్యం సర్దుబాటు చేయమన్నారని, ఆ తరువాత వాటిని మళ్లీ వెనక్కి ఇస్తామని చెప్పారని, అందుకే లారీతో తీసుకొచ్చి దింపుతున్నారు’ అని వివరించారు. రేషన్‌ బియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా సర్దుబాటు చేస్తారని నిలదీయడంతో ఆ నాయకుడు మారుమాట్లాడకుండా వెళ్లిపోయారు. 


ఘటనపై విచారణకు ఆదేశించామని జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ చెప్పారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, కేసు కూడా నమోదు చేస్తామని స్పష్టంచేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన అనకాపల్లి తహసీల్దార్‌ ప్రసాద్‌కు ఫోన్‌ చేశారు. తక్షణమే విచారణ చేయాలని ఆదేశించారు. అయితే తహసీల్దార్‌ సంఘటనా స్థలానికి వెళ్లకుండా డిప్యూటీ తహసీల్దార్‌(డీటీ) వెంకట్‌ను అక్కడికి పంపించారు. రాత్రి వేళ విచారణ ఏమిటంటూ ఆయన మొక్కుబడిగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయారు. దీనిపై విలేకరులు డీటీని ప్రశ్నించగా, ‘మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..’ అని జవాబిచ్చారు. 

Updated Date - 2020-04-28T09:36:16+05:30 IST