రేషన్‌ షాపుల వికేంద్రీకరణ

ABN , First Publish Date - 2020-04-05T08:57:35+05:30 IST

కరోనా నేపథ్యంలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా ప్రజాపంపిణీ వ్యవస్థలో రైతుబజార్ల తరహాలో రేషన్‌ షాపులను వికేంద్రీకరించాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఒక్కో షాపునకు మూడు

రేషన్‌ షాపుల వికేంద్రీకరణ

  • లబ్ధిదారుల భౌతిక దూరానికి ప్రాధాన్యం
  • ఒక్కో షాపునకు 3 అదనపు కేంద్రాలు
  • ఈ నెల 15 నుంచి అమలుకు చర్యలు


అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా ప్రజాపంపిణీ వ్యవస్థలో రైతుబజార్ల తరహాలో రేషన్‌ షాపులను వికేంద్రీకరించాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఒక్కో షాపునకు మూడు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న జరిగే రెండో విడ త పంపిణీలో ఈ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ ఆదేశించింది. ప్రస్తుత రేషన్‌ పంపిణీలో లబ్ధిదారులకు స్లిప్పులు పంపిణీ చేసినా ఒక్కసారిగా షాపులకు పోటెత్తుతున్నారు. దీంతో దుకాణాల వద్ద రద్దీ నియంత్రణ, భౌతికదూరం పాటించడం కష్టంగా మారాయి. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వచ్చేసారి పంపిణీలో ఈ సమస్య లేకుండా వికేంద్రీకరణకు శ్రీకారం చుడుతున్నారు. ముందురోజే ఏ సమయంలో ఏ కార్డుదారులు రావాలో స్లిప్పులు పంపిణీ చేస్తారు. అందరికీ ఒకే స్లిప్పులు ఇస్తే క్రమపద్ధతి లేకుండా ఒకేచోటకు వచ్చే ప్రమాదం ఉందని భావించి నాలుగు కేంద్రాలకు వేర్వేరు రంగుల్లో స్లిప్పులు పంపిణీ చేసి, ఆ రంగు స్లిప్పులకు పంపిణీ చేసే షాపునకు మాత్రమే వెళ్లాలనే నిబంధన పెడుతున్నారు. పోర్టబులిటీతో ఇబ్బంది లేకుండా తొలి మూడు రోజుల తర్వాతే వారికి రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదనపు కేంద్రాలను సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీహాళ్లు, ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు. వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్ల ద్వారా బయోమెట్రిక్‌ తీసుకుంటారు. దీంతో పౌరసరఫరాల పంపిణీలోనూ కరోనా ముందస్తు చర్యలు సఫలీకృతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2020-04-05T08:57:35+05:30 IST