నేటి నుంచే రేషన్‌ ధరల బాదుడు

ABN , First Publish Date - 2020-12-05T08:33:49+05:30 IST

పేదలపై వైసీపీ ప్రభుత్వం పెనుభారం మోపింది. రేషన్‌ దుకాణాల్లో రాయితీపై ఇచ్చే సరుకుల ధరలను భారీగా పెంచింది.

నేటి నుంచే రేషన్‌ ధరల బాదుడు

కందిపప్పు కిలోపై ఒకేసారి రూ.27 పెంపు

పంచదారపై ఇప్పటికే రూ.14 అదనం

పేదలపై 600 కోట్ల భారం 

‘కరోనా’ ఉచితం కట్‌ ఇక నగదుకే సరుకులు


అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పేదలపై వైసీపీ ప్రభుత్వం పెనుభారం మోపింది. రేషన్‌ దుకాణాల్లో రాయితీపై ఇచ్చే సరుకుల ధరలను భారీగా పెంచింది. గతంలో ఎన్నడూలేని విధంగా కందిపప్పు కిలోపై ఒకేసారి రూ.27 పెంచి పేదలకు ఝలక్‌ ఇచ్చింది. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకూ రేషన్‌ షాపుల్లోని కందిపప్పు ధర రూ.40 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.67 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.  పంచదారపై ఇప్పటికే కిలోపై రూ.14 పెంచిన విషయం తెలిసిందే. దానివల్ల ఒక్కో కార్డుదారునికి ఇచ్చే అరకిలో పంచదారపై కొత్తగా రూ.7 భారం పడింది. కొవిడ్‌ ప్రభావం ఇంకా ఉన్నందున ఈసారి కూడా రేషన్‌ ఉచితంగా ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి సమాచారమూ రాకపోవడంతో నేటినుంచి నగదుకే పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కందిపప్పు ధర పెంపు వల్ల నెలకు రూ.40 కోట్ల కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. పంచదారపై రూ.10 కోట్ల భారం పడింది. రెండూ కలిపి నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.600 కోట్లు పేదల నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది.


కరోనా తీవ్రంగా ఉందంటూనే ఉచితం కట్‌!

ఓ వైపు కొవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ ధరల పెంపు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా రాష్ట్రంలో తీవ్రంగా ఉందంటూనే.. పేదలకు ఇచ్చే ఉచిత సరుకులకు కోత పెట్టింది. తొలి విడత ఉచిత రేషన్‌ గడువు ముగిసిన తర్వాత జూలై నుంచే ఈ మేరకు ధరలు పెంచాలని నిర్ణయించింది. కానీ కేంద్రం ఆదేశాలతో ఇప్పటివరకూ ఆగాల్సి వచ్చింది. ఇక ఉచితం ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధరల పెంపు అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో రేషన్‌ సరుకులపై 50శాతం రాయితీ విధానం ఉండేది. దాన్ని వైసీపీ ప్రభుత్వం 25శాతానికి కుదించింది. ప్రతి మూడు నెలలకోసారి బహిరంగ మార్కెట్‌ ధరలను సమీక్షించి దాని సగటుపై 25శాతం తక్కువకు రేషన్‌ ధరలను నిర్ణయించే విధానం తీసుకొచ్చింది. దాని ప్రకారం కందిపప్పు, పంచదార ధరలను ఒకేసారి భారీగా పెంచారు. దీంతో బహిరంగ మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వం ఇచ్చే రాయితీ సరుకులకు మధ్య పెద్ద తేడా ఏమీ లేకుండా పోయింది.

Updated Date - 2020-12-05T08:33:49+05:30 IST