వేలిముద్రపై రగడ

ABN , First Publish Date - 2020-04-28T09:39:19+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్నా కార్డుదారులతో వేలిముద్రలు తీసుకుని రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేలిముద్రపై రగడ

సాధారణ పద్ధతి పాటించాలన్న ప్రభుత్వం

రేషన్‌ డీలర్లలో తీవ్ర అసంతృప్తి

సరుకులు పంపిణీ చేయలేమని వెల్లడి

పలుచోట్ల ఈ-పోస్‌ యంత్రాలు వాపస్‌


అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతున్నా కార్డుదారులతో వేలిముద్రలు తీసుకుని రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌ డీలర్లు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే పంపిణీ చేయడం మానేస్తాం కానీ వేలిముద్రలు తీసుకోలేమని తేల్చిచెబుతున్నారు. సోమవారం పలుచోట్ల డీలర్లు వారి ఈ-పోస్‌ యంత్రాలను తహసీల్దార్లకు అప్పగించారు. .కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేషన్‌ పంపిణీలో బయోమెట్రిక్‌ను పౌరసరఫరాల శాఖ గత రెండు విడతల పంపిణీల్లో నిలిపివేసింది. కార్డుదారులకు బదులుగా వీఆర్‌వోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేశారు.


కానీ మే నెలకు సంబంధించి ఈ నెల 29న ప్రారంభం కాబోతున్న పంపిణీకి  తప్పనిసరిగా కార్డుదారుల వేలిముద్ర తీసుకోవాలని  అన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు.  దీంతో అటు కార్డుదారుల్లో, ఇటు డీలర్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కరోనా మూడో దశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 29వేల రేషన్‌ షాపులు ఉన్నా యి. ఒక్కో షాపు పరిధిలో 500 నుంచి వెయ్యి కార్డులున్నాయి. ఇంతమందికి ఒకే బయోమెట్రిక్‌ మిషన్‌ వినియోగించాలి. ఒక్కరికి పాజిటివ్‌ ఉన్నా పెద్దఎత్తున వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది.  


ప్రాణం మీదకొస్తే బాధ్యులెవరు?: డీలర్ల సమాఖ్య

కార్డుదారుల నుంచి వేలిముద్రలు తీసుకునే సమయంలో డీలర్లకు కరోనా వ్యాపించి ప్రాణం మీదకొస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని రేషన్‌ డీలర్ల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లీలామాధవరావు, అడపా వెంకటరమణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-04-28T09:39:19+05:30 IST