ర్యాపిడ్‌పై ఫైర్‌!

ABN , First Publish Date - 2020-04-18T10:25:42+05:30 IST

రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ‘లాంఛనంగా’ ప్రారంభించిన తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కరోనా పరీక్షల నిబంధనలు తెలుసుకోండి’ అంటూ రాష్ట్ర

ర్యాపిడ్‌పై ఫైర్‌!

  • సీఎంకు పరీక్షపై అభ్యంతరం
  • ‘నెగెటివ్‌’ అంటే తెలుసా!
  • టెస్ట్‌ రూల్స్‌ తెలుసుకోండి!
  • ముఖ్యమంత్రికీ వివరించండి
  • కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్రానికి మెసేజ్‌
  • ప్రాథమిక లక్షణాలున్న వారికే పరీక్షలన్న ఐసీఎంఆర్‌
  • ర్యాండమ్‌ టెస్టుకూ వర్తింపు
  • ర్యాపిడ్‌పై రాష్ట్రాలకు సూచనలు


అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ‘లాంఛనంగా’ ప్రారంభించిన తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కరోనా పరీక్షల నిబంధనలు తెలుసుకోండి’ అంటూ రాష్ట్ర అధికారులకు సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను సమకూర్చుకుంది. వీటిని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్నట్లుగా... శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు టెస్ట్‌ చేశారు. ఫలితం ‘నెగెటివ్‌’ వచ్చిందని మీడియాకు ఫొటోలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. పనిలోపనిగా అక్కడే ఉన్న పలువురు ప్రముఖులకూ పరీక్షలు చేసి, వారికి వైరస్‌ సోకలేదని తేల్చేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్‌ స్పందించారు. ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి మెసేజ్‌ పెట్టారు. ‘‘కరోనా నెగెటివ్‌ అంటే ఏమిటి? ఎందుకు ఇలాంటివి ప్రకటనలు చేస్తున్నారు? ర్యాండమ్‌ టెస్టుకు సంబంధించిన విధి విధానాలను తెలుసుకోండి. మీ ముఖ్యమంత్రికి కూడా వివరించండి’’ అని సూటిగా చెప్పారు.


ఎందుకీ ఆగ్రహం... 

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం... కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు ఉన్న వారికే పరీక్షలు నిర్వహించాలి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని కూడా 14 రోజులు క్వారంటైన్‌కు పంపి, ఆ సమయంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాత్రమే టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నిబంధనలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలో శరీరంలో దాని తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చు. అప్పుడు పరీక్ష చేసినా ‘నెగెటివ్‌’ వచ్చే అవకాశముంది. ‘నెగెటివ్‌ వచ్చింది కదా!’ అని స్వేచ్ఛగా వదిలేస్తే, వారి ద్వారా మరికొందరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.


అందుకే... లక్షణాలు ఉన్న వారికి మాత్రమే (సిమ్టమ్యాటిక్‌) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాండమ్‌ టెస్టులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయకపోయినప్పటికీ ‘ఫ్లూ లక్షణాలు’ ఉన్న వారికి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలి. ముఖ్యమంత్రి జగన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమానిత లక్షణాలు లేనప్పటికీ ఆయనకు ర్యాపిడ్‌ కిట్‌తో టెస్ట్‌ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టే... కేంద్రం సత్వరం స్పందించినట్లు తెలిసింది.


ఐసీఎంఆర్‌ అప్రమత్తం

ఏపీలో ర్యాపిడ్‌ టెస్ట్‌ల ఎఫెక్ట్‌ వల్లో, మరో కారణమో కానీ... ఐసీఎంఆర్‌ గురువారం రాత్రి హుటాహుటిన అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టుల’ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ‘‘కోవిడ్‌-19 నిర్ధారణకు రియల్‌టైమ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌ (ఆర్టీ-పీసీఆర్‌) ఒక్కటే ప్రధానమైన పరీక్ష. దీనికి ర్యాపిడ్‌ టెస్ట్‌ ప్రత్యామ్నాయం కాదు. కరోనా లక్షణాలు మొదలైన వారం రోజుల తర్వాత మాత్రమే ర్యాపిడ్‌ టెస్ట్‌ పనికి వస్తుంది. వ్యాధిపై అధ్యయనం, పరిశీలనకు ర్యాపిడ్‌ టెస్టులు ఉపయోగపడతాయి. ఈ పరీక్షలను కూడా కచ్చితమైన వైద్య పర్యవేక్షణలోనే నిర్వహించాలి’’ అని స్పష్టం చేసింది.

Updated Date - 2020-04-18T10:25:42+05:30 IST