రెడ్‌జోన్స్‌లో ర్యాండమ్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-04-08T08:59:52+05:30 IST
రాష్ట్రమంతా వైజాగ్ తరహాలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ర్యాండమ్ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.

వైజాగ్ తరహాలో జరపాలి
వీలైతే హాట్స్పాట్లలో కూడా..
క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో
మెరుగైన వైద్య సదుపాయాలు
ఇంకొన్ని రోజులు శ్రద్ధపెట్టండి
కరోనా నివారణలో దేశానికి
ఆదర్శంగా నిలుస్తాం
ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం
ఉన్నతాధికారులతో సమీక్ష
క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో
మెరుగైన వైద్య సదుపాయాలు: సీఎం జగన్
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంతా వైజాగ్ తరహాలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ర్యాండమ్ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో క్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన అధికారులను, వైద్యులను అభినందించారు. ఇలాంటి తరుణంలో మరికొద్ది రోజులు మరింత శ్రద్ధ తీసుకుంటే.. కోవిడ్-19ను నివారించి దేశానికే ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారూ .. వారి ప్రైమరీ కాంటాక్టు పరీక్షలు పూర్తయ్యాక ఎవరెవరికీ పరీక్షలు నిర్వహించాలన్న విషయమై చర్చ జరిగింది. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పిలాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. వైజాగ్ తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ర్యాండమ్ సర్వే జరగాలని సీఎం ఆదేశించారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వేపైనా కూడా దృష్టి సారించాలని కోరారు.క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, వసతులను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. క్రిటికల్ కేర్ కోసం నిర్దేశించిన కోవిడ్ -19 ఆస్పత్రులు సన్నద్ధంగా ఉండాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు వసతులు మెరుగుపరచాలని కోరారు.
‘ఢిల్లీ’వారికి పరీక్షలు పూర్తి!
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందించారు. సోమవారం సాయంత్రం అయిదు గంటల నుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఒకే పాజిటివ్ కేసు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో మొత్తం 997 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఇందులో 196 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్టు అయి.. మూడు నాలుగు గంటలకు వారితో కలసి ప్రయాణం చేసిన వారిని గుర్తించి 2,400 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 84 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారిలో 280 కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన 205 మందికి పరీక్షలకు నిర్వహిస్తే.. 11 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.
వారితో కాంటాక్టు అయిన 120 మందిని పరీక్షిస్తే.. వీరిలో ఆరుగురు పాజిటివ్‌గా తేలారని.. కరోనా లక్షణాలు కలిగిన 134 మందికి పరీక్షలు చేస్తే .. వారిలో ఏడుగురికి నెగిటివ్ ఉందని వెల్లడైందని తెలిపారు. వలంటీర్లు, ఏఎన్ఎం, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పర్యవేక్షణలో లక్ష మంది హోం క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. అకాల వర్షాలపై సీఎం ఆరా తీశారు. బాధిత రైతులను గుర్తించి ఆదుకోవాలన్నారు.
వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి
వ్యవసాయోత్పత్ల్తుల మార్కెంగ్పై ప్రత్యేక దృష్టిని సారించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను జగన్ ఆదేశించారు. వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని .. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. ప్రతి రోజూ కనీసం 150 ట్రక్కుల అరటిని ఎగుమతి చేస్తున్నామన్నారు. టమాట విషయంలో ఇబ్బందులు తొలగాయన్నారు. ఆక్వా ఎగుమతులు పెరిగాయన్నారు.