నేనే ఎస్‌ఈసీ

ABN , First Publish Date - 2020-06-01T08:07:46+05:30 IST

హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తానేనని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు.

నేనే ఎస్‌ఈసీ

హైకోర్టు తీర్పులో చెప్పింది అదే

జస్టిస్‌ కనగరాజ్‌ ఆ పదవిలో ఉండేందుకు వీల్లేదు 

ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉండకూడదు 

ప్రభుత్వ వైఖరి కోర్టు ధిక్కారమే: నిమ్మగడ్డ రమేశ్‌


అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తానేనని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. హైకోర్టు తీర్పును, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఎస్‌ఈసీ హోదాలో ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన ఆర్డినెన్స్‌తో పాటు జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని రద్దుచేస్తూ, తీర్పు 307వ పేరాలో తనను ఎస్‌ఈసీగా కొనసాగించే పరిస్థితిని పునరుద్ధరించాలని కోర్టు పేర్కొందన్నారు. పదవీకాలం పూర్తయ్యేవరకు, అంటే 2021 మార్చి 31వరకు తనను ఆ పదవిలో కొనసాగించాలని ఆదేశించిందన్నారు. ఎస్‌ఈసీగా కొనసాగే తన హక్కును హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.


తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని, పాత పరిస్థితిని పునరుద్ధరించాలని తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తనను తొలగించలేదని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు స్పష్టం చేసిందని, ఆర్డినెన్స్‌ ద్వారా కనగరాజ్‌ను నియమించామని చెప్పిందన్నారు. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో తాను ఆ పదవిలో ఉన్నట్లేనని వివరించారు. హైకోర్టు తీర్పు ప్రకారమే తాను చార్జ్‌ తీసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చానని తెలిపారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కూడా సర్క్యులర్‌ ద్వారా నోటిఫై చేశారన్నారు. కానీ హైకోర్టు ఆదేశాలను అమలు జరిపే పరిస్థితి లేదని గతనెల 30న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అసమంజసంగా ఉందని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-01T08:07:46+05:30 IST