కుదింపు కుదరదు!

ABN , First Publish Date - 2020-05-30T07:23:58+05:30 IST

రాష్ట్ర సర్కారుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించడమే ..

కుదింపు కుదరదు!

రమేశే ఎస్‌ఈసీ.. హైకోర్టు విస్పష్ట తీర్పు

జగన్‌ సర్కారుకు భారీ షాక్‌

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పదవీకాలం ఐదేళ్లు

పూర్తికాలం కొనసాగడం ఆయన హక్కు

దాన్నెవరూ మధ్యలో లాక్కోలేరు: బెంచ్‌

ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగపర రక్షణ

ఉద్వాసనకు అభిశంసన ఒక్కటే మార్గం

77 ఏళ్ల వ్యక్తిని నియమించడం సంస్కరణా?

కుదింపు ఆర్డినెన్స్‌ మోసపూరితం, ఏకపక్షం

ఆర్డినెన్స్‌ ఇచ్చేంత అత్యవసరం ఏమిటి?

ఇందులో సహేతుకత, సమంజసత లేవు

ఎస్‌ఈసీగా రమేశ్‌ను కొనసాగించాలి

హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు

జస్టిస్‌ కనగరాజ్‌ నియామకమూ రద్దు


రమేశ్‌ కుమార్‌ 2016 జనవరి 30న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ఐదేళ్లు అని జీవో ఎంఎస్‌ నంబరు 11లో పొందుపరిచారు. అది పూర్తయ్యేదాకా పదవిలో ఉండే అధికారం ఆయనకు ఉంది. దానిని మధ్యలో ఎవరూ లాక్కోలేరు. ఒకవేళ మధ్యలో తొలగించాలంటే... పదవిలో ఉండి తప్పుగా ప్రవర్తించారనే అభియోగంపై హైకోర్టు జడ్జిని తొలగించేందుకు అనుసరించే 


‘అభిశంసన’ ప్రక్రియనే అనుసరించాలి. ఆర్డినెన్స్‌ జారీ చేసి, దాని మేరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎస్‌ఈసీని తప్పించడం కుదరదు.  

-హైకోర్టు


అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సర్కారుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించడమే లక్ష్యంగా.... జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఇతర జీవోలను హైకోర్టు కొట్టివేసింది. తప్పుచేసినట్లు రుజువు చేసి అభిశంసిస్తే తప్ప... ఆయనను అర్ధంతరంగా పదవి నుంచి తప్పించలేరని తేల్చిచెప్పింది. ‘నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఐదేళ్లూ పదవిలో ఉండటం ఆయన హక్కు. దానిని మధ్యలో ఎవరూ లాక్కోలేరు’ అని స్పష్టం చేసింది. ఆయనను పూర్తికాలం పదవిలో కొనసాగించాలని ఆదేశించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నికల ప్రక్రియను  వాయిదా వేయడం... ఆయనపై  


ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడటం... ఆ తర్వాత ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించి నిమ్మగడ్డకు ఉద్వాసన పలకడం... కొత్త ఎస్‌ఈసీగా రాత్రికి రాత్రి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించడం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తోపాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.  ‘నిమ్మగడ్డే ఎస్‌ఈసీ’ అని తేల్చిచెప్పింది. ఆయన తొలగింపుతోపాటు, కొత్త ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకానికి సంబంధించిన మూడు జీవోలను రద్దు చేసింది.


చట్ట విరుద్ధమే... 

ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపుతోపాటు దానికి అనుగుణంగా జారీ చేసిన జీవోలు చట్టవిరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. సర్వీసు రూల్స్‌ నిబంధనల వ్యవహారంలో ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్ప ఇతరత్రా ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అవసరం లేదన్న పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.


రాజ్యాంగం ప్రకారం ఎస్‌ఈసీని మధ్యలో తొలగించాలంటే హైకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు అనుసరించే  ‘అభిశంసన’ ప్రక్రియ తప్ప మరో మార్గమే లేదని విష్పష్టంగా పేర్కొంది. ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం గవర్నర్‌కు ఉందని పేర్కొన్న ధర్మాసనం.. ఎస్‌ఈసీ వ్యవహారంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ అధికరణ 213లో పేర్కొన్న నిబంధనలను సంతృప్త్తిపరిచేలా లేవని తప్పుబట్టింది. ఆర్డినెన్స్‌కు సంబంధించి గవర్నర్‌కు సిఫారసు చేసే అధికారం కేబినెట్‌కు ఉన్నప్పటికీ...ఈ వ్యవహారంలో అది సరికాదని పేర్కొంది. ఎస్‌ఈసీ పదవికి రాజ్యాంగ రక్షణ వుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. 


మోసపూరితం... ఏకపక్షం

ఎస్‌ఈసీని నియమించే విచక్షాణాధికారం రాజ్యాంగంలోని అధికరణ 243 కె (1) ప్రకారం గవర్నర్‌కు ఉందని ధర్మాసనం తెలిపింది. ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని తెలిపే రాజ్యాంగంలోని అధికరణ 243 కె(2)లో ‘అప్పాయింట్‌మెంట్‌’ గురించి లేదని... ఎస్‌ఈసీ నియామకం, కొనసాగింపు ఏదేని శాసనసభ చట్ట ప్రకారం, లేదా గవర్నర్‌ ఆమోదించిన నిబంధనల మేరకు ఉంటుందని తెలిపింది. ‘‘సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని రూపొందించే అధికారం మాత్రమే శాసన వ్యవస్థకు ఉంటుంది తప్ప... ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమాకం ఎలా ఉండాలన్నది మంత్రి మండలి సిఫారసు మేరకు ఆర్డినెన్స్‌ ద్వారా నిర్ణయించలేరు’’ అని తెలిపింది.


  ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం గవర్నర్‌కు ఉందంటూనే... ఇప్పుడు ఎస్‌ఈసీ వ్యవహారంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ అధికరణ 213(1)లో పేర్కొన్న నిబంధనలను సంతృప్త్తిపరిచేలా లేవని తప్పుబట్టింది. గవర్నర్‌ సంతృప్తి చెందేలా సంబంధంలేని కారణాలతో తప్పుడు ఉద్దేశాలతో అధికారాన్ని వినియోగించినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ఇది అధికారాన్ని ఉపయోగించి జారీచేసిన మోసపూరిత ఆర్డినెన్స్‌. ఆర్టికల్‌ 14 నిర్దేశించిన హేతుబద్ధత, సహేతుక పరీక్షకు నిలవదు’’ అని ధర్మాసనం పేర్కొంది.


గవర్నర్‌ సంతకం లేకుండా...: నూతన ఎస్‌ఈసీ నియామక ఫైలు కార్యాచరణను ముందు ప్రారంభించి... ఆపై నిమ్మగడ్డ పదవీకాలం కుదించేందుకు ఫైలు కదపడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘‘ఇప్పటి వరకూ 22 మందిని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా నియమించారు. వారెవరూ 65 ఏళ్లకు పైబడిన వారు కాదు. ఇప్పుడు 77 ఏళ్ల వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించడం ఎన్నికల సంస్కరణల్లో భాగం కాదు’’ అని చురకలు అంటించింది.


ఆర్డినెన్స్‌ మేరకు నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందంటూ ఏప్రిల్‌ 10వ తేదీ రాత్రి 9.45 గంటలకు ఫైలు కదిలించారని... దానిపై గవర్నర్‌ సంతకం లేకుండానే పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి రాత్రి 10.07 గంటలకు ఆమోదంతో జీవో 618 జారీ చేశారని తెలిపింది. ‘‘రమేశ్‌కుమార్‌ పదవీ కాలాన్ని కుదించేందుకు గల కారణమేదీ ప్రభుత్వం వద్ద లేదు. ఆర్డినెన్స్‌ తీసుకురావడానికి, గవర్నర్‌ తక్షణ చర్యలకు సైతం సరైన కారణాలు లేవు. అకారణంగా, దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి... కొత్త ఎస్‌ఈసీని నియమించారు. అంతేతప్ప... ఈ నియామకం అధికరణ 243 కె(1) ద్వారా జరిగినది కాదు’’ అని తెలిపింది.


ఐదేళ్లూ ఉండాలి... 

1994లో పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన జీవో 927 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగవచ్చునని ధర్మాసనం పేర్కొంది. రమేశ్‌ కుమార్‌ 2016 ఏప్రిల్‌ 1వ తేదీన బాధ్యతలు చేపట్టారని... 2021 మార్చి 31వ తేదీ వరకు ఆయన పదవీకాలం ఉందని తెలిపింది.


‘‘ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని శాసనవ్యవస్థ అభీష్టానికి వదిలేస్తే, ఎస్‌ఈసీకి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ లేకుండా పోతుంది. స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశానన్న కారణంగానే ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఎన్నికల సంస్కరణల కోసం మార్చి మూడో వారం నుంచి కేంద్రంతో సంప్రదింపులు జరిపామని ప్రభుత్వం చెప్పడం గమనిస్తే.. స్థానిక ఎన్నికల వాయిదా తరువాతే అదంతా జరిగినట్లు అవగతమవుతోంది’’ అంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ చేసిన వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.


తీర్పు అమలును నిలిపేయండి

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనువుగా ప్రస్తుత తీర్పు అమలును నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పు అమలును నిలిపేయని పక్షంలో తమ న్యాయప్రయోజనాలు దెబ్బతింటాయని వివరిం చింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం తీర్పు వెలువరించగానే తీర్పు అమలుపై స్టే కోరేందుకు అడ్వకేట్‌ జనరల్‌ సమాయత్తమ వుతుండగానే... కాన్ఫరెన్స్‌ కనెక్షన్‌ కట్‌ అయిందని, అందువల్ల వెంటనే తీర్పు అమలుపై స్టే అడగడం కుదరలేదని వివరించింది. 


జస్టిస్‌ వి.కనగరాజ్‌ వాదన ఇలా...

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగించలేదు. ఎన్నికల సంస్కరణల కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా చట్టంలో మార్పు రావడంతో ఆయన పదవి కోల్పోయారు. గవర్నర్‌ సంతృప్తి చెందాకే ఆర్డినెన్స్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌తో రాష్ట్ర సరిహద్దులు మూసేసివుండగా చెన్నై నుంచి తనను హడావుడిగా రప్పించి, బాధ్యతలు స్వీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందంటూ నిమ్మగడ్డ తప్పుబట్టడం సరి కాదు. ఫలానా వ్యక్తి ఎస్‌ఈసీ పదవిలో వుండాలని అడిగే హక్కు మిగిలిన పిటిషనర్లెవ్వరికీ లేదు. 


ఇతర పిటిషనర్లు ఏం చెప్పారంటే!

రాజ్యాంగంలోని 243కె అధికరణ ప్రకారం ఎస్‌ఈసీ పదవీ కాలం ఐదేళ్లు. ప్రస్తుత జీవో ప్రకారం పదవీకాలం మూడేళ్లకే ముగిసిపోతుంది. ఈ జీవో తీసుకురావడమంటే ఎన్నికల కమిషన్‌ విధుల్లో జోక్యం చేసుకోవడమే. 


న్యాయవాదులు వీరే...

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు డీవీ సీతారామమూర్తి, దమ్మాలపాటి శ్రీనివాస్‌, వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి, ఎ.సత్యప్రసాద్‌, బి.ఆదినారాయణరావు, న్యాయవాదులు తాండవ యోగేష్‌, జంధ్యాల రవిశంకర్‌, నళిన్‌ కుమార్‌, వీవీ నరసింహారావు, డీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌బాబు, టి.శ్రీధర్‌, నర్రా శ్రీనివాసరావు, కంభంపాటి రమేశ్‌బాబు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, జస్టిస్‌ వి.కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు.


ఇదీ నిమ్మగడ్డ వాదన... 

‘‘నేను స్థానిక ఎన్నికలు వాయిదా వేయకుంటే రాష్ట్రం కరోనా వైర్‌సకు హాట్‌స్పాట్‌గా మారేది. తద్వారా దారుణ పరిణామాలకు కేంద్ర బిందువయ్యేది. దీని నివారించేందుకు ఎన్నికలు వాయిదా వేయడంతో... రాష్ట్ర ప్రభుత్వం నాతో ఘర్షణకు దిగింది. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దురుద్దేశంతోనే నన్ను తొలగించింది.  ఎస్‌ఈసీగా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించడం వల్లనే ప్రభుత్వం నన్ను తొలగించింది. అధికార పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు కోరడంతోపాటు అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించడమే నా తప్పు. ఎస్‌ఈసీగా నేను జారీ చేసిన ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దేశవ్యాప్తంగా వైద్యపరమైన అత్యవసర స్థితి నెలకొని ఉన్న సమయంలో... తన తొలగింపునకు సంబంధించి హడావుడిగా ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం గ్రహించవచ్చు. ఆర్డినెన్స్‌ ఎల్లప్పుడూ న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది. అధికార దుర్వినియోగంతో ఆర్డినెన్స్‌లను జారీ చేస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.


రాష్ట్ర ప్రభుత్వం వాదన...

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994 నిబంధనల మేరకే ఎస్‌ఈసీ పదవీ కాలం, సర్వీసు నిబంధనల్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కోసమే ఈ ఆర్డినెన్స్‌. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, దానికోసం సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం గత మార్చిలోనే కేంద్రానికి  తెలియజేసింది. ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పలు వివాదాలున్నాయి. ఉమ్మడి హైకోర్టు సైతం ఈఎన్నికలపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే సంస్కరణలు తీసుకురావాలని.. ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది తప్ప హడావుడి నిర్ణయం కాదు. అధికరణ 243కె మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూర్పు ఎలా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం. ఆ బాధ్యతల్లో హైకోర్టు విశ్రాంత జడ్జి ఉండాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం. ఈ ఆర్డినెన్స్‌ పట్ల గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామన్న పిటిషర్‌ వాదన పూర్తి వాస్తవం కాదు. 


Updated Date - 2020-05-30T07:23:58+05:30 IST