గవర్నర్‌గారూ.. జోక్యం చేసుకోండి

ABN , First Publish Date - 2020-06-25T07:11:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని వేధింపు చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ..

గవర్నర్‌గారూ.. జోక్యం చేసుకోండి

ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ కల్పించండి

ఎన్నికల కమిషనర్‌ను నియమించేది మీరే

నేను బాధ్యతలు చేపట్టేందుకు కలగజేసుకోండి

భద్రత కోసం కేంద్రానికి లేఖ రాసింది నేనే

అయినా విజయసాయి ఫిర్యాదుతో సీఐడీ చర్యలు

కార్యాలయంలో కీలక సమాచారం తీసుకెళ్లారు

హైదరాబాద్‌లో నాపై నిరంతర నిఘా

ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారు

విశ్వభూషణ్‌కు నిమ్మగడ్డ రమేశ్‌ లేఖ

గవర్నర్‌గారూ.. జోక్యం చేసుకోండి!


అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని వేధింపు చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని తాను తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు వీలు కల్పించాలని.. రాజ్యాంగ సంస్థలను కాపాడాలని బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తన నివాసంపై 24 గంటలూ నిఘా పెట్టారని, స్వేచ్ఛగా తిరగకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని తన ఐఫోన్‌ నుంచి గవర్నర్‌కు రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఉన్న తన నివాసం వద్ద నిరంతరం ఏపీ 18పీ 0706 నంబరు కలిగిన ఫోర్డు వాహనం, మరో రెండు మోటార్‌ సైకిళ్లు నీడలా వెంటాడుతున్నాయని తెలిపారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు అర్థమవుతోందన్నారు. తనకు భద్రత పెంచాలని మార్చి 18న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయడంతో సెక్యూరిటీ పెంచారని.. అయితే ఆ లేఖ ఫోర్జరీ అంటూ విచిత్రంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ‘నేనే ఆ లేఖ రాశానని చెప్పినా.. కేంద్ర హోం కార్యదర్శి నిర్ధారించినా పట్టించుకోకుండా సీఐడీ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల సంఘం కార్యాలయంపై దాడి చేసి ఆఫీసుకు సంబంధించిన కీలక సమాచారమున్న కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కను తీసుకెళ్లారు. నేను టైపు చేశానని చెప్పినా వినకుండా.. ఆఫీసులో ఉద్యోగిని అదుపులోకి తీసుకుని.. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ బయట టైపు చేసి తెచ్చిందని చెప్పాలని ఒత్తిడి చేశారు.


నేను విజయవాడకు తిరిగొచ్చేందుకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఎస్‌ఈసీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించింది. విజయవాడలో అనారోగ్యంతో బాధపడుతున్న నాతల్లిని కూడా చూడలేకపోతున్నాను. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సమాధానం చెప్పడం లేదు. హైకోర్టు మే 29న ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. జస్టిస్‌ కనగరాజన్‌ను తొలగించి ఆ స్థానంలో నన్ను నియమించాల్సి ఉన్నా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సంఘ కార్యాలయానికి చెందిన వాహనం ఇన్నోవా 0010ని ఇప్పటికీ ఆయన స్వాధీనంలోనే ఉంచారు. ఈ చర్యలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛ, సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కే ఉంది. ఆ బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఇదే విషయంపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. రాజ్యాంగ సంస్థలు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రక్షించాల్సింది మీరే. నేను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మీరు జోక్యం చేసుకోవాలి. నాపై ప్రభుత్వ వేధింపులను అడ్డుకునే చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలి’ అని గవర్నర్‌ను అభ్యర్థించారు.

Updated Date - 2020-06-25T07:11:00+05:30 IST