రమేష్ కుమార్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన కామినేని
ABN , First Publish Date - 2020-04-26T01:15:21+05:30 IST
రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టులో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. కామినేని

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టులో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. కామినేని శ్రీనివాస్ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు టాస్క్‌ఫోర్స్ నియమించిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలను రాష్ట్రం ఆమోదించిందన్నారు. దాని ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఐదు సంవత్సరాల పదవీకాలం తప్పనిసరిగా ఉండాలన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదని నిబంధన ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్‌కు 65 సంవత్సరాల వయసు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు కూడా చెబుతున్నాయని ఉటంకించారు.
ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం .. కేంద్రం ఆమోదించిన టాస్క్‌ఫోర్స్ నిబంధనలను పట్టించుకోలేదని ఆరోపించారు. రాజ్యాంగంలోని 217 నిబంధనకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పూర్తి విరుద్ధం అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం, కాల పరిమితిని కుదించడం అనేది 217 నిబంధనను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. వయసును పేర్కొనకుండా సవరణకు తీసుకురావటం.. 65 సంవత్సరాలు పైబడిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎన్నికల సంస్కరణల కిందకు రాదన్నారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మినిస్టీరియల్ పోస్ట్ చేయటం మంచిది కాదన్నారు. అయితే తన వాదనను లిఖిత పూర్వకంగా కూడా తెలియజేస్తానని న్యాయవాది రవిశంకర్ పేర్కొన్నారు.