అక్కడ ఉండనివ్వక.. ఇక్కడకు రాలేక

ABN , First Publish Date - 2020-03-25T09:21:49+05:30 IST

బతుకుదెరువు కోసం బెహ్రైన్‌కు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కరోనా ప్రభావంతో స్వదేశానికి...

అక్కడ ఉండనివ్వక.. ఇక్కడకు రాలేక

  • బెహ్రైన్‌లో రాజమండ్రి వాసి ఆత్మహత్య 


రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24: బతుకుదెరువు కోసం బెహ్రైన్‌కు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కరోనా ప్రభావంతో స్వదేశానికి వచ్చే వీలు లేక, అలాగని అక్కడే ఉండే అవకాశం లేక మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం గొల్లవీధికి చెందిన వర్ధనపు మహేశ్‌(23) ఉపాధి కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి గతేడాది బెహ్రైన్‌ దేశానికి వెళ్లాడు. కరోనా కారణంగా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చెల్లెలు రత్నానికి ఫోను చేసి తాను భారత్‌కు వస్తున్నానని చెప్పాడు.


మధ్యలో పని మానేస్తే జీతం ఇవ్వరని తిరిగి తానే కట్టాలని చెబుతూ, తన చెల్లెలిని డబ్బులు అడిగాడు. విమాన టికెట్‌కు డబ్బులు చూస్తానని ఆమె చెప్పడంతో తన వద్ద ఉన్న ఫోను అమ్మి డబ్బులు కట్టేస్తానని చెప్పాడు. దీంతో తాను ఈ నెల 22న విమాన టికెట్‌ తీశానని, అయితే.. కరోనా ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు చేయడంతో తన అన్న ఆగిపోయాడని తెలిపింది. ఇంతలోనే ఇండియన్‌ ఎంబసీ నుంచి 23న ఒకవ్యక్తి ఫోను చేసి మహేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పినట్టు తెలిపింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవడంతో చివరి చూపు కూడా దక్కలేదని మహేశ్‌ తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

Updated Date - 2020-03-25T09:21:49+05:30 IST