ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ABN , First Publish Date - 2020-10-14T19:28:01+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తునేఉన్నాయి. మరో నాలుగు రోజులపాటు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తునేఉన్నాయి. మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో ప్రవాహం పెరిగింది. గాలులు, వర్షాలకు తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. వర్ష బీభత్సానికి కోస్తాంధ్రలో జనజీవనం స్తంభించిపోయింది.
ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు తాండవ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంతాలైన విశాఖ జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా అల్లిపుడి, కోట నందూరు, కుమ్మరిలోవా గ్రామాల మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో గడ్డలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కుమ్మరిలోవ సమీపంలో కట్రాళ్లకొండవద్ద రోడ్డుపైకి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలైన రెల్లికాలనీ, తారకరామానగర్, మేదరపేట ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.