అందుకే బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు: పురంధేశ్వరి

ABN , First Publish Date - 2020-09-18T16:14:50+05:30 IST

బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అందుకే బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు: పురంధేశ్వరి

ప్రకాశం జిల్లా: బీజేపీ మహిళా నేత  దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ప్రభుత్వం బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల ధ్వంసం, విగ్రహాల అపహరణలు కొనసాగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఆలయాలకు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నదనే వివరణను ప్రజలకు ఇవ్వాలన్నారు.


అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించామని, రధం రెండు నెలల్లో తయారవుతుందని చెప్పటం సరికాదని పురంధేశ్వరి అన్నారు. ఆలయాల భద్రతపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయటాన్ని ఎవరూ స్వాగతించరని, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు ఎలా తిప్పారో అందరూ చూశారన్నారు. ప్రభుత్వం ఆలయ భూములను కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని పురంధేశ్వరి విమర్శించారు.


కాగా బీజేపీ ఛలో అమలాపురం నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. సుమారు 600 మంది అమలాపురంలో రాత్రి నుంచి పహారా కాస్తున్నారు. బీజేపీ నేతలు పట్టణంలోకి ప్రవేశించకుండా కోనసీమకు వచ్చే అన్ని దారులను మూసివేశారు. కొందరు నేతలు అర్ధరాత్రి ఏదోలా పట్టణంలోకి రాగా వారిని గుర్తించి అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో అమలాపురం జరిపి తీరుతామని బీజేపీ స్పష్టం చేస్తోంది. 

Updated Date - 2020-09-18T16:14:50+05:30 IST