ఈసీకి సీఆర్‌పీఎఫ్‌ రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2020-03-19T10:03:20+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌కు కేంద్ర సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

ఈసీకి సీఆర్‌పీఎఫ్‌ రక్షణ కల్పించండి

  • వైసీపీ శ్రేణులు దాడి చేసే ప్రమాదం
  • అమిత్‌ షాకు కన్నా లేఖ


అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌కు కేంద్ర సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటినుంచి ఇలాంటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో పోలీసులు ఇంత ఏకపక్షంగా అధికార పార్టీకి వంతపాడిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీని సీఎం జగన్‌, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో దూషించారని పేర్కొన్నారు. గౌరవ ప్రదమైన స్థానంలో ఉండే అసెంబ్లీ స్పీకర్‌ సైతం పరుష వ్యాఖ్యలు చేసి కమిషనర్‌ని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల చరిత్రలో ఎన్నడూ జరగనంత హింస జరిగిన నేపథ్యంలో రమేశ్‌ కుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందున కేంద్రం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో ఎస్‌ఈసీకి రక్షణ కల్పించాలని అమిత్‌ షాకు కన్నా విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు కూడా అమిత్‌ షాకు మరో లేఖ రాశారు. స్థానిక ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.


సీఎం క్షమాపణ చెప్పాలి

గుడివాడ టౌన్‌: ‘‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి.  సుప్రీంకోర్టు ఈసీ నిర్ణయాన్ని సమర్ధించినందున సీఎం జగన్‌ కమ్మ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి’’ అని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గుడివాడలో డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-19T10:03:20+05:30 IST