ఆది నుంచీ అడ్డదారే!

ABN , First Publish Date - 2020-05-13T10:54:47+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వ్యవహార తీరు తొలి నుంచీ అడ్డగోలుగానే ఉందని పలువురు నిపుణులు విమర్శించారు.

ఆది నుంచీ   అడ్డదారే!

అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి

తప్పు చేశామని 2019 మేలోనే అఫిడవిట్‌ 

అప్పుడే ఎల్జీ పాలిమర్స్‌ను మూసేయాల్సింది

కీలుబొమ్మగా మారిన కాలుష్య నియంత్రణ మండలి

ఎన్‌జీటీ ముందు నోరువిప్పిన ఎన్‌జీవోలు


విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వ్యవహార తీరు తొలి నుంచీ అడ్డగోలుగానే ఉందని పలువురు నిపుణులు విమర్శించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ కోసం విశాఖపట్నం వచ్చిన ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)’ మంగళవారం ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ‘సంస్థ ఏర్పాటైన నాటి (1997) నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీయే ఒప్పుకొంది. గత ఏడాది... అంటే 2019 మే 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అఫిడవిట్‌ సమర్పించింది.


ఈ విదేశీ కంపెనీకి నాటి నంచి నేటి వరకూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ సహకరిస్తూ వచ్చాయి. అఫిడవిట్‌ సమర్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అద్భుతమైన అవకాశం లభించింది. అదే అదనుగా కంపెనీని మూసేయవచ్చు. కానీ ఆ పని చేయలేదు. కొనసాగింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు 12 మంది ప్రాణాలు పోయాయి’ అంటూ స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీనికి హాజరైన కొందరు, హాజరుకాలేకపోయిన మరికొందరు కూడా తమ సూచనలు అందించారు. 


ఇవీ సలహాలు, సూచనలు

కమిటీలు వేయడం, నివేదికలు తీసుకోవడం... ఆ తరువాత వాటిని పక్కనపెట్టడం రివాజుగా మారింది. దీనికి అడ్డుకట్ట వేయాలి. ప్రజలకు నమ్మకం కలిగేలా... ఈసారైనా బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి. నిపుణులు ఇప్పుడు కమిటీలో ఉన్నందున.. జాతీయ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. 4 ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని కీలుబొమ్మగా వాడుకుంటోంది. ప్రమాదాలు జరిగినప్పుడు నాయకులు ప్రవేశించి.. అంతా అధికారులదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా నిజమని నమ్ముతున్నారు. ఎవరి ఒత్తిళ్ల వల్ల పీసీబీ చేతులు ముడుచుకొని కూర్చుంటున్నదీ బయటకు తెలియడం లేదు. ఈ పద్ధతి పోవాలి. వారికి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. 


పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో పర్యావరణ ప్రభావాలపై అంచనా కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇవన్నీ వాటికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ నివేదిక అనేది ఆటబొమ్మలా మారిపోయింది. ఎక్కువ నిబంధనలు పెట్టి ఉల్లంఘనలకు అవకాశం ఇస్తున్నారు. అలాకాకుండా తక్కువ షరతులను కఠినంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ తప్పనిసరి..డాక్టర్‌ ఎన్‌.భానుమతి దాస్‌, డైరక్టర్‌ జనరల్‌, ఇన్‌స్వారెబ్‌


ప్రతి పరిశ్రమలోనూ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వాలి. అక్కడ జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయో వివరించి, వాటిని ఎదుర్కొనే శిక్షణ, అవగాహన కల్పించాలి. స్థానిక పోలీస్‌ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, పీసీబీ అధికారులందరికీ భాగస్వామ్యం కల్పించాలి. 


Read more