ఆపలేరు.. కట్టలేరు!

ABN , First Publish Date - 2020-12-06T08:20:04+05:30 IST

నిర్మాణరంగంలో కీలకమైన రెండు వస్తువులు...స్టీల్‌, సిమెంటు. ఆ రెండింటి ధరలు ఆకాశాన్నంటడంతో నిర్మాణదారులు షాక్‌కు గురవుతున్నారు.

ఆపలేరు.. కట్టలేరు!

భగ్గుమన్న సిమెంటు, స్టీల్‌ ధరలతో బెంబేలు

పది రోజుల్లోపే రికార్డు స్థాయికి.. స్టీల్‌ టన్ను రూ.45 వేలు నుంచి 60 వేలకు

సిమెంటు బస్తా రూ.300 నుంచి 350కి.. చిన్నఇల్లు కట్టాలన్నా ఇక చుక్కలే

వడ్డీల భయంతో ఇల్లు ఆపడానికి లేదు.. అలాగని ముందుకెళ్లి కట్టలేని పరిస్థితి

ప్రభుత్వానికి బస్తా రూ.240కే సరఫరా.. దీంతో కట్టడి చర్యలు పట్టని వైనం


అతనిది కృష్ణా జిల్లా విస్సన్నపేట. చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడు. కొంతకాలంక్రితం దానికి రెండుటన్నుల స్టీల్‌ అవసరమైంది. షాపుకెళ్లి అడిగితే రూ.92 వేలు అవుతుందన్నారు. ఆ డబ్బు కూడగట్టుకోవడానికి 10 రోజులు పట్టింది. ఆ మొత్తం పట్టుకుని షాపుకెళ్లి స్టీల్‌ ఇమ్మన్నాడు. షాపు ఆయన ఇప్పుడు అదే స్టీల్‌కి రూ.1.20లక్షలు కట్టాలన్నాడు. అదేంటి? అంటే ధరలు పెరిగాయని చావు కబురు చల్లగా చెప్పాడు. రూ.92వేలు సమీకరించుకోవడానికి నానా తిప్పలు పడ్డ ఆయన.. ఇప్పుడు ఒకేసారి రూ.28వేలు పెరిగిందని చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది.  


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నిర్మాణరంగంలో కీలకమైన రెండు వస్తువులు...స్టీల్‌, సిమెంటు. ఆ రెండింటి ధరలు ఆకాశాన్నంటడంతో నిర్మాణదారులు షాక్‌కు గురవుతున్నారు. అవి ఎంత పెరిగాయంటే..ఆల్‌టైం రికార్డు... చరిత్రలో ఎప్పుడూ చూడనంత... ఇంత పెరుగుతుందా? అని ఎప్పుడూ ఊహించనంతగా ఇల్లెక్కి కూర్చొన్నాయి. స్టీల్‌ ధర కొన్నిరోజులు క్రితం వరకు టన్ను రూ.45వేలు ఉండేది. ఇప్పుడది విపరీతంగా పెరిగింది. ఏదో ఐదొందలు, వెయ్యి పెరగడం కాదు. ఏకంగా ఒక టన్ను స్టీల్‌కే రూ.15వేల వరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం స్టీల్‌ ధర దాదాపు రూ.60వేలకు చేరి ఇల్లు నిర్మించుకునేవారికి చుక్కలు చూపిస్తోంది. ఇక సిమెంటు ధర విషయానికి వస్తే కొన్నిరకాల సిమెంటు బస్తా ధర రూ.390కి చేరింది.


అల్ర్టాటెక్‌, కేసీపీ లాంటి సిమెంటు ధరలు ఈ స్థాయికి పెరిగిపోయి గూబగుయ్యిమనిపిస్తున్నాయి. ఇతర రకాల సిమెంట్లు రూ.330నుంచి రూ.350వరకు పెరిగిపోయాయి. ఈ వారంరోజుల్లోనే వీటిఽ ధరలు బస్తాకు రూ.50-60వరకు పెరిగిపోయాయి. ఏడాదిన్నర క్రితం బస్తా సిమెంటు ధర రూ.260కి దొరికేది. దానికి ఇప్పుడు ఏకంగా రూ.100ఎక్కువ పెట్టాల్సి వస్తోంది. అయితే గతంలో ఎప్పుడైనా రూ.10 పెంచేవారు. ఇప్పుడు ఒకేసారి ఏకంగా రూ.50-60పెంచేశారు. ఇసుక ధర కొట్టిన దెబ్బకు అసలే దిమ్మతిరిగిన రాష్ట్రంలోని నిర్మాణదారులు లోలోపలే బాధపడే పరిస్థితి వచ్చింది. పల్లెటూళ్ల నుంచి నగరాల వరకు ఇసుక ధర దాదాపు రెట్టింపు కావడం, కొన్నిచోట్ల మూడురెట్లు కూడా కావడంతో పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ ఇసుకకు ఇప్పుడు స్టీల్‌, సిమెంటు కూడా దానికి తోడవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. 


ఇల్లెక్కి.. దిగడం లేదు

ప్రభుత్వానికి సిమెంటు బస్తా సుమారు రూ.240కే సరఫరా చేస్తున్నారు. ఇది మంచిదే. కానీ, ప్రజలకు మాత్రం దానికంటే దాదాపు రూ.100-150ఎక్కువగా అమ్ముతున్నారు. సిమెంటు బ్రాండ్‌ను బట్టి ఈ ఽభారం ఎంతనేది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి తక్కువ ధరకే వస్తుండడంతో పెద్దగా భారం తెలియడం లేదు కానీ ప్రజలకు మాత్రం ఏం చేయాలో తోచని స్థితి ఏర్పడుతోంది. అప్పులపాలయ్యే పరిస్థితికి వారిని తీసుకెళ్తున్నారు. కొవిడ్‌ ముందు కూడా సిమెంటు, స్టీల్‌ ధరలు తక్కువగానే ఉన్నాయి. అంతకుముందుతో పోలిస్తే కొంత పెరిగినా మరీ ఇంతగా పెరగలేదు. కానీ కొవిడ్‌ తర్వాత క్రమంగా ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలవుతుండగానే.. ధరల పెంపు పెనుభారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.


డిస్పాచ్‌ నియంత్రణ

సిమెంటు కంపెనీలు సరఫరాను (డిస్పాచ్‌) నియంత్రిస్తున్నాయన్న విమర్శ ఉంది. ఇంతగా సిమెంటు ధర పెరగడానికి అదీ ఒక కారణమని అంటున్నారు. అదే సమయంలో డీలర్ల కమీషన్లను సిమెంటు కంపెనీలు తగ్గించగా, ఆ భారం వినియోగదారులపై డీలర్లు వేస్తున్నారనే ప్రచారం ఉంది. కారణాలేవైనా చిన్న ఇంటి నుంచి ఒక మాదిరి ఇంటిదాకా.. ఏది నిర్మించుకోవాలన్నా ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇల్లు కట్టడమంటేనే అప్పుతో కూడుకుందని...పెరిగిన ధరలతో అనివార్యంగా మరింత అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ‘నిర్మాణంలో ఉన్న ఇంటిని మధ్యలో ఆపలేం. ఆపితే డబ్బుల్లేక ఆపేశారంటారు. పరువు పోతుంది. గుట్టుగా అప్పు తెచ్చుకుని ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నాం’ అని గుంటూరులో ఇంటిని నిర్మించుకుంటున్న ఒకాయన వాపోయారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-12-06T08:20:04+05:30 IST