రాష్ట్రపతే తేల్చాలి

ABN , First Publish Date - 2020-07-19T09:13:00+05:30 IST

రాజధాని బిల్లుల వ్యవహారం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి ఆస్కారం కల్పిస్తోందని, వాటిని రాష్ట్రపతి పరిశీలన కు పంపడమే ప్రస్తుతం గవర్నర్‌ ముందున్న

రాష్ట్రపతే తేల్చాలి

  • వివాదం నెలకొన్నప్పుడు రాష్ట్రపతి వద్దకు గవర్నర్‌ పంపాలి
  • బిల్లులు ఇంకా మండలి పరిశీలనలోనే: యనమల


అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాజధాని బిల్లుల వ్యవహారం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి ఆస్కారం కల్పిస్తోందని, వాటిని రాష్ట్రపతి పరిశీలన కు పంపడమే ప్రస్తుతం గవర్నర్‌ ముందున్న ప్రత్యమ్నాయమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘మామూలుగా అయితే రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే. కాని రాష్ట్ర విభజన రాష్ట్ర పునర్‌వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం జరిగింది. ఏపీ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని, దానికి కేంద్రం సాయం చేస్తుందని చట్టంలో పేర్కొన్నారు. దీనిని పార్లమెంటు ఆమోదించింది. ఆ చట్టంలో పేర్కొన్న ఒక రాజధాని అన్నదానిని 3 రాజధానులుగా మార్చాలంటే మళ్ళీ పార్లమెంటు మాత్రమే ఆ చట్టానికి సవరణ చే యాలి. రాష్ట్రానికి ఆ అధికారం లేదు. ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో రాజధానిని ఎక్కడ పెట్టాలన్న అంశంపై పరిశీలన చేయడానికి కేంద్రం ఒక కమిటీని కూడా నియమించింది. ఈ పరిస్ధితుల్లో రాజధానులపై రాష్ట్రం తన సొంత నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్ధితిలో రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకే ఆయనకు పంపాలని మేం గవర్నర్‌ను కోరుతున్నాం. కావాలంటే ఆయన దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవచ్చు’ అని యనమల చెప్పారు. ‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్‌ సభలో ప్రకటించారు. సభలో ఛైర్మ న్‌ ఏ నిర్ణయం తీసుకొంటే అదే ఫైనల్‌. దానిలో కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఆ నిర్ణయం ప్రకారం రాజధాని బిల్లులు మండలి ముందు ఇంకా పరిశీలనలో ఉన్నట్లే లెక్క. సభ తిరస్కరి స్తే అప్పుడు వాటంతట అవి ఆమోదం పొందడానికి అ వకాశం వస్తుంది. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్ళాయని ప్రభుత్వం కూడా కోర్టు ముందు ఒప్పుకొంది. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం చెప్పకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. సమయం ముగిసింది కాబట్టి వాటంతట అవి ఆమోదం పొందాయన్నది కేవలం ప్రభుత్వ వాదన. అది చెల్లదు. ఈ విషయం కోర్టు పరిశీలనలో ఉంది. ఈ వివాదం ఉన్నప్పుడు గవర్నర్‌ ఏకపక్షంగా బిల్లులను ఆమోదించరాదని మేంకోరుతున్నాం. అదే విషయం గవర్నర్‌కు లిఖితపూర్వకంగా తెలియపర్చాం’ అని వివరించారు. ‘ప్రభుత్వం ఇప్పటికే ఖజానాలో డబ్బు లేదని చెబుతోంది. డబ్బు సమకూర్చుకోవడం పై దృష్టి పెట్టకుండా అదనపు ఖర్చుకు దారితీసేలా మూడు రాజధానులు ఎందు కు?’ అని యనమల ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ విషయంలో గవర్నర్‌కు మరో ప్రత్యమ్నాయం లేదని, తిరిగి నియమించాల్సిదేనని చెప్పారు. 

Updated Date - 2020-07-19T09:13:00+05:30 IST