రాయి 500.. బొమ్మ 5000

ABN , First Publish Date - 2020-11-21T08:59:30+05:30 IST

సమగ్ర సర్వే కోసం ఉపయోగించే రాయి ఖరీదు ఎంత ఉంటుంది? వాటిపై ప్రభుత్వ అధికార చిహ్నం, పేర్లు ముద్రిస్తే ఎంతవుతుంది? అంతా కలిపి .

రాయి 500..  బొమ్మ 5000

సరిహద్దు రాళ్ల వ్యయమే వేరయా!

నల్ల గ్రానైట్‌పై ఎంబ్లమ్‌, బాణం గుర్తు 

తయారీకి ఒక్కో జిల్లాలో ఒక్కో ఖర్చు

రూ.6 వేలతో అదరగొట్టిన సిక్కోలు

సాదారాళ్లు తెచ్చిన కడప, కృష్ణా

13 జిల్లాల మోడళ్లతో ప్రదర్శన 

వాటిని పరిశీలించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)ఫ సమగ్ర సర్వే కోసం ఉపయోగించే రాయి ఖరీదు ఎంత ఉంటుంది? వాటిపై ప్రభుత్వ అధికార చిహ్నం, పేర్లు ముద్రిస్తే ఎంతవుతుంది? అంతా కలిపి 500లోపు ఉంటుందని భావిస్తున్నారా? మీ ఊర్లో ఉంటే ఉండొచ్చు. కానీ సర్వే వారి లెక్కచూస్తే మతిపోక తప్పదు. ఐదు అడుగుల ఎత్తయిన రాయికి అయ్యే ఖర్చు 500. వాటిపై ముద్రించే బొమ్మలు, పేర్లకు రూ. 5000. వెరసి ఒక్కో సర్వేరాయికి రూ.5500. అదీ రాష్ట్రం అంతా కాదు. ఇది అనంతపురం జిల్లా లెక్క. ఒక్కో జిల్లాలో ఒక్కో రేటు. శ్రీకాకుళంలో ఏకంగా రూ.ఆరు వేలు! ఇలా 13 జిల్లాల నుంచి ప్రత్యేకమైన, ఖరీదైన నల్లగ్రానైట్‌తో సర్వే రాళ్లను డిజైన్‌ చేయించి విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ప్రదర్శించారు. వీటిని ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పరిశీలించారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ. 987 కోట్లతో చేపట్టే రీ సర్వే ప్రాజెక్టులో సర్వే రాళ్ల ఖర్చే రూ. 600 కోట్లుగా ప్రతిపాదించారు.


ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రీ సర్వేకు తొలుత ఆరు కోట్ల సరిహద్దు రాళ్లు కావాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఒక్కో రాయికి రూ. 4500పైనే ఖర్చుకానుందని అంచనావేశారు. దీని ప్రకారం రాళ్ల ఖర్చే రూ. 27వేలకోట్లపైనే కానుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇది హేతుబద్ధంగా లేదన్న పెద్దల మండిపాటుతో  ఆ ప్రతిపాదన మరుగునపడిపోయింది. ఆ తర్వాత సర్వే రాళ్లపై సమగ్ర భూ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గుర్తు ( ఎంబ్లమ్‌), బాణం గుర్తులతోపాటు సీఎం జగన్‌ చిత్రాలను చెక్కించారు. వాటిని సీఎంకు ప్రదర్శించేందుకు సిద్దమవుతుండగా ’’శిలలపై జగనన్న శిల్పాలు’’ శీర్షికతో ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. దీంతో సీఎం బొమ్మలు రాళ్లపై ముద్రించవద్దన్న మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.


అయితే, రీ సర్వే జరిగే గ్రామాల్లో ప్రభుత్వ , అటవీ భూములు, ప్రైవేటు భూములకు ఎలాంటి రాళ్లను ఉపయోగించాలి? గ్రామ సరిహద్దులకు వేటిని వాడాలన్నదానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. అసలు ఎలాంటి రాయిని సర్వేకు ఉపయోగించాలో ఇతమిత్థంగా చెప్పలేకపోతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న రాళ్లపై డిజైన్లు వేసి తీసుకురావాలని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సీఎం కార్యాలయం అధికారులు వాటిని పరిశీలిస్తారన్న సమాచారం వెళ్లింది. దీంతో అధికారులు ఎక్కడా తగ్గకుండా మంచి ఖరీదైన నల్ల గ్రానైట్‌ రాళ్లను డిజైన్‌ చేయించి తీసుకొచ్చారు. వాటిపై సమగ్ర భూ సర్వే 2021, రాష్ట్ర ప్రభుత్వ ఎంబ్లమ్‌,  రెండువైపులా బాణం గుర్తులు, ఇంకా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్షణ, మీ భూమి-మా హామీ అని పేర్లు రాయించారు. ఈరాయినే సర్వేకు ఉపయోగిస్తే ఎంత ఖర్చవుతుందో ఓ పేపర్‌పై రాసి అతికించారు. 


మచ్చుకు కొన్ని...

1)అనంతపురం జిల్లా నుంచి తీసుకొచ్చిన సర్వేరాయి ఖరీదు రూ.5500. ఇందులో రాయి ఖర్చు రూ. 500. వాటిపై ముద్రించే  బొమ్మకు రూ. 5000. 2)శ్రీకాకుళం నుంచి  తెప్పించిన  నల్లగ్రానైట్‌ ఖరీదు రూ. 6వేలు. 3) చిత్తూరు జిల్లా నుంచి డిజైన్‌ చేయించి తీసుకొచ్చిన రాయి ఖరీదు రూ. 5000. 4) కర్నూలు జిల్లా నుంచి  తెప్పించిన  స్టోన్‌ ఖరీదు రూ. 3వేలు. ఇందులో రాయికి  అయ్యే ఖర్చు రూ. 1000, వాటిపై ముద్రించే బొమ్మలకు రూ. 2వేలు. 5)కడప జిల్లా నుంచి సాధారణ రాళ్లను తీసుకొచ్చారు. గతంలో సర్వేకు ఇలాంటి వాటినే ఉపయోగించారు. దీని ఖరీదు రూ. 250 అని పేర్కొన్నారు. 6)గ్రానైట్‌ ఖిల్లా ప్రకాశ ం జిల్లా నుంచి బ్లాక్‌ గెలాక్సీ రాయిని అందంగా డిజైన్‌ చేయించి తీసుకొచ్చారు. ఒక్కో రాయి ఖరీదు రూ. 4500. రీ సర్వే పైలెట్‌ నిర్వహించిన కృష్ణా జిల్లా అధికారులు సాధారణ నల్లరాయిని తీసుకొచ్చారు. రాయి ఖరీదు రూ. 400 ఉంటే, దాని కటింగ్‌, డిజైన్‌ ఇతర ఖర్చులు రూ. 3000గా పేర్కొన్నారు. ఇలా ఒక రాయికి మొత్తంగా రూ. 3400 ఖర్చుకానుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-21T08:59:30+05:30 IST