పోలవరంలో నేటి నుంచి ‘పీపీఏ’ పర్యటన
ABN , First Publish Date - 2020-12-20T08:59:59+05:30 IST
పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) బృందం ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు పోలవరంలో విస్తృతంగా పర్యటించనుంది. పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్ అయ్యంగార్ నేతృత్వంలో ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న బృందం.. ఈ నెల 23 వరకు పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు, స్పిల్‌వే బ్రిడ్జి

నాలుగు రోజుల పాటు వివిధ అంశాలపై దృష్టి
భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై సమీక్ష
సీఈవో అయ్యంగార్ నేతృత్వంలో వచ్చిన బృందం
అమరావతి/పోలవరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) బృందం ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు పోలవరంలో విస్తృతంగా పర్యటించనుంది. పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్ అయ్యంగార్ నేతృత్వంలో ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న బృందం.. ఈ నెల 23 వరకు పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు, స్పిల్‌వే బ్రిడ్జి కాంక్రీటు పనులు, స్పిల్‌వే రేడియల్ గేట్ల అమరిక, అప్రోచ్ పనులు, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను ఈ బృందం నిశితంగా పరిశీలించనుంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వైపున్న ఎడమ ప్రధాన కాల్వ కనెక్టవిటీ పనులను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. బృందంలోని అధికారులు సోమ, మంగళవారాల్లో తూర్పుగోదావరిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను పరిశీలించి, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. భూసేకరణ నిధులపై అయ్యంగార్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక, పర్యటనలో చివరి రోజు బుధవారం కూడా ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించిన అనంతరం హైదరాబాద్‌కు వెళతారు. తన పర్యటన వివరాలను అయ్యంగార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు నివేదిక రూపంలో అందజేయనున్నారు.
అంచనాలపై కదలిక వచ్చేనా?
పోలవరం నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన వారికి సహాయ పునరావాసం, భూసేకరణ చెల్లింపులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇటీవల రీయింబర్స్‌మెంట్ చేసిన రూ.2234.288 కోట్లను కూడా భూసేకరణ, సహాయ పునరావాసానికే ఖర్చు చేయాలని పీపీఏ ద్వారా రాష్ట్రానికి తెలియజేసింది. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జల సంఘం పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) నిర్ధారించింది. దీనిపై కేంద్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పీపీఏ సీఈవో నివేదిక ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.