మా నీళ్లు మా హక్కు

ABN , First Publish Date - 2020-05-13T08:29:41+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మా నీళ్లు  మా హక్కు

ఆ మేరకే ‘సీమ దుర్భిక్ష’ నివారణ పథకం

కేటాయింపుల మేరకే నీటి వినియోగం

మాకే పరిమితులు విధించాలనుకుంటారా?

శ్రీశైలం నీటిమట్టం 881 అడుగులు ఉంటేనే

పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలం

అంత ప్రవాహం పది రోజులైనా ఉండదు

ఎవరైనా మానవతా దృక్పథంతో ఉండాలి

కృష్ణా బోర్డు కేటాయింపుల మేరకే సీమ స్కీం

వైఎస్‌ మానవత్వంతో వ్యవహరించారు

కాబట్టే తెలంగాణలో ప్రాజెక్టులు వచ్చాయి

800 అడుగులలో వారు తీసుకోవడం లేదా?

మేము తీసుకుంటే ఎలా తప్పవుతుంది?

తెలంగాణ అభ్యంతరాలపై జగన్‌ వ్యాఖ్యలు

కృష్ణా జలాల వివాదంపై సీఎం జగన్‌ 


అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పోతిరెడ్డిపా డు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద కాల్వల విస్తరణ పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిమితులు విధించాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై  జగన్‌ స్పందించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కృష్ణా జలాల అంశంపై జల వనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులతో ఆయన సమీక్ష జరిపారు.


‘‘శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటి మట్టం సంవత్సరంలో సగటున పది రోజులకు మించి ఉండడం మహాకష్టం. ఈ పదిరోజుల్లోనే హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాలి. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను కేటాయిస్తుందని గుర్తుచేశారు. ‘‘ఇది మన హక్కు. కేటాయింపులకు లోబడి రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తాం.


మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం. పరిధి దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదు. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్ర మే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి మట్టం 854 అడుగులకు చేరితే దీని ద్వారా ఏడు వేల క్యూసెక్కులు కూడా వెళ్లడం కష్టం. 841 అడుగులకు చేరితే వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వెళ్తాయి. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాల నుంచి గరిష్ఠంగా 9,000 క్యూసెక్కులే వెళ్తున్నాయి. అది కూడా శ్రీశైలంలో 854 అడుగుల మేర జలాలుంటేనే’అని అన్నారు.


తెలంగాణ నుంచి ఇలా..

తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగులు స్థాయిలోనూ రోజుకు రెండు టీఎంసీల మేర ( అంటే 23,149 క్యూసెక్కులు) అందించవచ్చని చెప్పారు. ఇలా 90 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని సీఎం అన్నారు.  ‘జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌ల నుంచి శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే తెలంగాణ జలాలను తీసుకోగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో మాకు పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం’ అని అన్నారు.


బోర్డు పర్యవేక్షిస్తోంది..

కృష్ణా ట్రైబ్యునల్‌ ఎవరెన్ని నీళ్లు వాడుకోవాలో నిర్ణయించిందని, కృష్ణా బోర్డు ఆ పంపకాలను పర్యవేక్షిస్తోందని.. అలాంటప్పుడు ఎవరైనా దీనిని రాజకీయం చేయడం సమంజసం కాదని జగన్‌ తెలిపారు. ‘ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానవత్వంతో ఆలోచించడం వల్లే తెలంగాణ ప్రాంతంలో ఇదే శ్రీశైలం నుంచి పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత గానీ.. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నారు. అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతోనే కదా రాజశేఖరెడ్డి ఆ స్థాయిలో నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టులను ప్రారంభించారు! అలాంటిది ఇటువైపు కరువు పీడిత ప్రాంతానికి నీళ్లివ్వాలంటే.. పరిమితులు విధించడం కరెక్టు కాదు. మన నీళ్లు మనం తీసుకుంటాం’ అని కుండబద్దలు కొట్టిచెప్పారు. ఎవరైనా కృష్ణా బోర్డు నిర్దేశాల మేరకే తీసుకోవాలని స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-13T08:29:41+05:30 IST