నేడు జనరణభేరి

ABN , First Publish Date - 2020-12-17T07:39:55+05:30 IST

ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను గురువారం రాయపూడి వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.

నేడు జనరణభేరి

రాయపూడిలో ఏడాది ఉద్యమ సభ 

సభకు షరతులతో కూడిన అనుమతి

అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం

అదే జరిగితే నిర్వాహకులదే బాధ్యత: డీఐజీ


గుంటూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను గురువారం రాయపూడి వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు సభ జరుతామని ప్రకటించారు. దానికి అనుగుణంగా నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు 30వేల మంది దాకా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పీ మధు, కే రామకృష్ణ, ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌రెడ్డి, తులసిరెడ్డి తదితరులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా, జనరణభేరి సభలోకి అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు.


‘‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంది. జేఏసీ నాయకుల వినతిపై  సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చాం. కొన్ని  అల్లరి మూకలు గొడవలకు పాల్పడొచ్చునని మాకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా నిర్వాహకులదే బాధ్యత’’ అని డీఐజీ వివరించారు. సభ దృష్ట్యా కరకట్టరోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు. 

Updated Date - 2020-12-17T07:39:55+05:30 IST