మానవత్వం పరిమళించే!

ABN , First Publish Date - 2020-04-15T09:39:54+05:30 IST

పోలీసులు అనగానే సహజంగానే వారి డ్యూటీ నిబంధనలు, కాఠిన్యం గుర్తుకువస్తాయి.

మానవత్వం  పరిమళించే!

ఈ నెల 2న ఉదయం నిత్యవసర సరుకులతో హైదరాబాద్‌ నుంచి తిరుపతికి మూడు లారీలు బయలుదేరాయి. అయితే, అప్పటికే దేశవ్యాప్తగా లాక్‌డౌన్‌ పటిష్ఠంగా కొనసాగుతోంది. డ్రైవర్లు మధ్యాహ్నం భోజనం చేద్దామంటే లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడా హోటళ్లు కనిపించలేదు. కర్నూలులో తిందాంలే అనుకున్నారు. అక్కడా అదే పరిస్థితి. రాత్రి 10.45 గంటలకు కడప శివారుకు చేరుకున్నారు. ఆకలికి తట్టుకోలేక మూసిన ఓ హోటల్‌ వద్దకు వెళ్లి రోజంతా అన్నం లేదు.. నీరసంతో కళ్లు తిరుగుతున్నాయి..


డబ్బెంతైనా ఇస్తాం.. అన్నం వండి పెట్టమని కోరారు. డీఎస్పీ సూర్యనారాయణకు ఫోన్‌ చేయండి.. మీ వద్దకే భోజనం వస్తుందని వారు సెల్‌ నంబరు ఇచ్చారు. లాఠీలు ఝుళిపించే పోలీసులు అన్నం పెడతారా..? అనే అనుమానం మనసును తొలిచినా.. ఎక్కడో చిరు ఆశతో సదరు డ్రైవర్లు కాల్‌ చేశారు. రాత్రి 11.15 గంటలకు కానిస్టేబుల్‌ వచ్చి భోజనాలు అందించారు.


కడప నగరంలో 20 మంది నిరుద్యోగ యువత ఉద్యోగ వేటలో కోచింగ్‌ తీసుకుంటూ పార్ట్‌టైంగా షాపుల్లో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల షాపులు మూసేశారు. హోటళ్లు లేవు. ఓ రోజంతా ఆకలితో అలమటించారు. ఆకలి మంటలు భరించలేక డీఎస్పీకి కాల్‌ చేశారు. గత నెల 25 నుంచి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వారికి టిఫిన్‌, భోజనం వారుండే రూమ్‌కే పంపుతున్నారు. ఇదంతా చేస్తున్నది ఖాకీ దుస్తుల మాటున కారుణ్యం నింపుకొన్న కడప డీఎస్పీ సూర్యనారాయణ అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. 


కరోనా వేళ.. పోలీసుల కారుణ్యం


(కడప-ఆంధ్రజ్యోతి):పోలీసులు అనగానే సహజంగానే వారి డ్యూటీ నిబంధనలు, కాఠిన్యం గుర్తుకువస్తాయి. అయితే, వీటికి భిన్నంగా కరోనా సమయంలో కాల్‌ చేసి సార్‌.. ఆకలితో ఉన్నామనగానే భోజనం పంపించి వారి ఆకలి తీరుస్తున్నారు కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ. కరోనా.. లాక్‌డౌన్‌తో పేద, ధనిక భేదం లేకుండా అందరూ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రెక్కాడితేగానీ పూట గడవని పేదలు, బతుకుపోరులో వలస వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, అనాథలు ఆకలి మంటలతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు పేదలు, అనాథల ఆకలి తీరుస్తూ సామాజిక బాధ్యతలోనూ సూర్యనారాయణ ప్రదర్శిస్తున్న చొరవ ఎందరికో సాంత్వన చేరుకూరుస్తోంది. కడప డీఎస్పీగా సూర్యనారాయణ 2019 జూలై 24న బాధ్యతలు చేపట్టారు.


ఆ రోజు నుంచి తన ఆఫీసుకు సామాన్య జనం ఏ పనిపై వచ్చినా వారికి అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. వలస కూలీలకు అండగా నిలిచి రోజుకు 70 నుంచి 100 మందికి ఆకలి తీరుస్తున్నారు. ఇది రోజువారి కార్యక్రమం. అయితే.. కరోనాని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలు, అనాథలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిసుకొని వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు. అదే సమయంలో ఎస్పీ అన్బురాజన్‌.. సూర్యనారాయణను ప్రోత్సహించారు. కడప సబ్‌డివిజన్‌ పరిధిలో ఏయే ప్రాంతాల్లో అనాథలు, భిక్షగాళ్లు, ఆకలితో అలమటించే పేదలు ఉన్నారో గుర్తించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారి ఆకలి తీరుస్తున్నారు. 


వలస కూలీలకు నిత్యావసర సరుకులు

పొరుగు రాష్ట్రాల నుంచి పనుల కోసం కడపకు 165- 175 కుటుంబాలు వలస వచ్చాయి. అనంతపురం జిల్లా గుత్తి, కర్నూలు జిల్లా నుంచి భవన నిర్మాణ పనుల కోసం వచ్చిన దాదాపు 150 కుటుంబాలు లాక్‌డౌన్‌ వల్ల ఇక్కడే ఉండిపోయాయి. వారికి డీఎస్పీ అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంటనూనె, ఇతర రాష్ట్రాల వారికి అదనంగా పది కిలోలు గోధుమ పిండి పంపిణీ చేశారు. 


ఇదో.. అదృష్టం!.. సూర్యనారాయణ, కడప డీఎస్పీ 

లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక పస్తులుంటున్న పేదలకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం. కడప సబ్‌ డివిజన్‌ పరిధిలోని పేదలు, అనాథలు ఆకలిగా ఉందని నా ఫోన్‌ నెంబర్‌ 91211 00515కు ఏ సమయంలో కాల్‌ చేసినా తక్షణమే వారి వద్దకు అన్నం పంపుతున్నా. ఎస్పీ అన్బురాజన్‌ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. 


Updated Date - 2020-04-15T09:39:54+05:30 IST