ఉలిక్కిపడ్డ పోలీస్‌!

ABN , First Publish Date - 2020-03-16T09:15:32+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు జిల్లాల ఎస్పీలు, రెండు సబ్‌డివిజన్ల డీఎస్పీలు, నలుగురు సీఐలపై వేటుకు సిఫారసు చేయడంతో పోలీసుల్లో కంగారు

ఉలిక్కిపడ్డ పోలీస్‌!

  • ఊహించని షాకిచ్చిన ఎస్‌ఈసీ.. 
  • ఎస్పీ నుంచి సీఐల వరకూ వేటు
  • సీఎం వ్యాఖ్యలతో చర్యలకు బ్రేక్‌
  • గీతదాటితే వేటు తప్పదేమోనని ఆందోళన


అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు జిల్లాల ఎస్పీలు, రెండు సబ్‌డివిజన్ల డీఎస్పీలు, నలుగురు సీఐలపై వేటుకు సిఫారసు చేయడంతో పోలీసుల్లో కంగారు మొదలైంది. కొందరి మెప్పుకోసం చిక్కుల్లో పడాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో వారిపై చర్యలకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటోన్న పోలీసులు వరుస పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఏపీ పోలీస్‌ పరువు పోతోందంటూ సీనియర్‌ ఐపీఎ్‌సలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా క్షేత్రస్థాయి పోలీసులు ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెచ్చుమీరిన హింసను కట్టడి చేయాల్సిన పోలీసులు చాలాచోట్ల అధికార పార్టీ అఽభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. హింసాత్మక ఘటనలు తీవ్రంగా పరిగణిస్తున్నామని, అన్నింటినీ పరిశీలిస్తామని ఈసీ చేసిన వ్యాఖ్యలు పోలీసుల్ని కలవరపరిచాయి. ఈ నేపథ్యంలో తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేశ్‌రెడ్డి, గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావుపై వేటు పడింది. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను తప్పించాలని, తిరుపతి, పలమనేరు, తాడిపత్రి, రాయదుర్గం సీఐలను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించిన ఈసీ... గుంటూరు జిల్లా మాచర్ల సీఐని సస్పెండ్‌ చేయాలని పేర్కొంది. ఒకేరోజు ఇన్ని షాక్‌లు తగలడంతో పోలీసు శాఖలో ఆందోళన మొదలైంది.


నలిగిపోతున్నాం

అధికార పార్టీ నేతల ఒత్తిడి, రాజ్యాంగ సంస్థల చర్యల మధ్యలో నలిగి పోతన్నామని పోలీసులు వాపోతున్నారు. పోస్టింగ్‌ రావాలంటే పనితీరు కన్నా పాలక పార్టీ నేతల సిఫారసులకే విలువ ఎక్కువని పోలీసులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల లేఖలతో పోస్టింగులు తెచ్చుకోక తప్పడం లేదంటున్నారు. ఎమ్మెల్యేలు సూచించిన వారికే స్టేషన్‌, సర్కిల్‌ దక్కుతుండగా మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేల ఆశీర్వాదంతో డీఎస్పీలకు సబ్‌ డివిజన్లలో పోస్టింగ్‌ వస్తోంది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించడానికి పోలీసులే పలుచోట్ల రంగంలోకి దిగాల్సి వస్తోందని చెబుతున్నారు.


ఎన్నికలొస్తే ఇంతేనా? 

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలీసులపై వైసీపీ నేతలు ఢిల్లీలో ఈసీకి రోజూ ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎస్‌ అనిల్‌చంద్ర పునేఠా, రాష్ట్ర సీఈవో ఆర్పీ సిసోడియా, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌, శ్రీకాకుళం, ప్రకాశం, కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, కోయ ప్రవీణ్‌, రాహుల్‌దేవ్‌ శర్మపై పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఆర్పీ ఠాకూర్‌ మినహా దాదాపు అందరినీ ఈసీ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఈసీ సిఫారసుల మేరకే సీఎ్‌సగా ఎల్వీ సుబ్రమణ్యం, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కుమార విశ్వజీత్‌, ఇతర జిల్లాల ఎస్పీలనూ మార్చారు.


ప్రతిపక్షాలకు ఎప్పుడూ చేదే 

టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ ఆరోపించారు. తనపై విశాఖలో జరిగినదాడి, బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య కేసుల్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా వచ్చే పోస్టింగులపైనా జగన్‌ సోదరి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కేవలం 43చోట్ల మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని, ఏపీ పోలీసుల పనితీరు భేష్‌ అని సీఎం జగన్‌ ప్రశంసించారు. ఆ తర్వాత కొంతసేపటికి ప్రెస్‌మీట్‌ పెట్టిన చంద్రబాబు.... ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలపై వాట్సాప్‌లో జోక్‌లు చక్కర్లు కొడుతున్నాయి. 

Updated Date - 2020-03-16T09:15:32+05:30 IST