‘చలో తంబళ్లపల్లె’ను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-12-13T09:00:49+05:30 IST
చిత్తూరు జిల్లా అంగళ్లు గ్రామంలో తమ నేతల కాన్వాయ్‌పై వైసీపీ దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ పిలుపునిచ్చిన చలో

తిరుపతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా అంగళ్లు గ్రామంలో తమ నేతల కాన్వాయ్‌పై వైసీపీ దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ పిలుపునిచ్చిన చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి తదితరులు తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళుతుండగా వారి కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడగా, ముఖ్యనేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సంఘటనతో ఆగ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి ఘాటుగా లేఖ రాశారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ వర్గాలు దీనిపై స్పందించడంతో శనివారం ఛలో తంబళ్లపల్లె పేరిట పార్టీ పిలుపునిచ్చింది. అయితే పోలీసులు తంబళ్లపల్లె నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్టుతో పాటు 144 సెక్షన్లు విధించారు. చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి తమ అనుమతి లేదని ప్రకటించారు. దానితో పాటు జిల్లావ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన కలికిరి మండలం నగరిపల్లెలో ఆయన నివాసాన్ని శుక్రవారం అర్ధరాత్రే పోలీసులు చుట్టుముట్టారు. ఆయన్ను హౌస్ అరెస్టు చేశామని శనివారం ఉదయం సమాచారమిచ్చారు. దీంతో నియోజకవర్గవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు నగరిపల్లెకు తరలివచ్చి కిషోర్‌కు సంఘీభావం తెలిపారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైౖర్మన్ నరసింహయాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాధరెడ్డి, చిత్తూరులో పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, శాంతిపురం మండలం వెంకటేపల్లెలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరే్‌షకుమార్‌రెడ్డి, మదనపల్లెలో తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, ముఖ్యనేత శ్రీనాధరెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు కార్యకర్తల నుంచి అనూహ్యరీతిలో మద్దతు లభించింది.