ఆమె పెద్ద మనస్సుకు పోలీసులు ఫిదా

ABN , First Publish Date - 2020-04-15T18:21:48+05:30 IST

ఇవాళ ఎక్కడ చూసినా పోలీసులకు పళ్లు, జ్యూస్‌లు, మాస్కులు, శానిటైజర్లు అందిస్తూ చాలా మంది కనిపిస్తున్నారు.

ఆమె పెద్ద మనస్సుకు పోలీసులు ఫిదా

అమరావతి: ఇవాళ ఎక్కడ చూసినా పోలీసులకు పళ్లు, జ్యూస్‌లు, మాస్కులు, శానిటైజర్లు అందిస్తూ చాలా మంది కనిపిస్తున్నారు. కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ పోలీసుల సేవలకు కృతజ్ఞతగా తమకు తోచినది, చేతనైనంతలో చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని అరుదైన దృశ్యాలు హృదయాలను తాకుతున్నాయి. మావత్వపు పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఇక్కడున్న ఆమె.. ఓ సాధారణ కూలీ. జీతం రూ.3500. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూల్ డ్రింక్స్ కొని తీసుకువచ్చి.. అయ్యా తీసుకోండంటూ ఆమె ఇవ్వడంతో పోలీసులు మహానందం వ్యక్తం చేశారు. అయితే వాటిని పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. ‘‘మీ మనస్సు గొప్పదమ్మా.. వాటిని మీ పిల్లలకు ఇవ్వండి’’ అంటూ తమ దగ్గరున్న ఫ్రూటీ బాటిల్స్‌ను కూడా ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ‘‘రోజూ ఓసారి కనిపించమ్మా... నిన్ను చూస్తే చాలా ధైర్యంగా ఉంటుంది’’ అంటూ చివరలో పోలీసులు అనడం పలువురిని కదిలించింది.


ఈ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో మానవత్వంపై మనకున్న నమ్మకాన్ని ఈ దృశ్యాలు పునరుద్ధరించాయి. ఖరీదు కట్టలేని, కల్మషం లేని ఆమె నవ్వు, స్ఫూర్తిని అభినందించాలి’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. 


‘‘కనిపించేవి ఫొటోలకు ఫోజులు.. లేనిపోని ఆడంబరాలు.. చేసే సేవపై దృష్టి తక్కువ.. మిగిలిన వాటిపై ఎక్కువ’’ అన్నట్టుగా ఈ రోజుల్లో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఆమె పోలీసులపై చూపిస్తున్న గౌరవాభిమానాలకు హ్యాట్సాఫ్ అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. Updated Date - 2020-04-15T18:21:48+05:30 IST