మొదట 41.5 మీటర్లే!

ABN , First Publish Date - 2020-12-15T09:04:26+05:30 IST

‘పోలవరం ప్రాజెక్టులో 41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోనే మొదట పునరావాస పనులు చేపడతాం.

మొదట 41.5 మీటర్లే!

దాని ప్రకారమే పునరావాస పనులు!

అవి కూడా దశలవారీగా పూర్తిచేస్తాం

ఇందుకోసం రూ.3,330 కోట్ల వ్యయం అవుతుంది

ప్రాజెక్టు ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గదు

విడతలవారీగా 45.72 మీటర్లకు పెంచుకుంటూ పోతాం

మే నాటికి స్పిల్‌వే, చానల్‌ పూర్తి.. 2022 ఖరీఫ్‌కు నీరివ్వాలి

పోలవరం సమీక్షలో సీఎం జగన్‌.. ప్రాజెక్టు పనుల పరిశీలన


ఏలూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రాజెక్టులో 41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోనే మొదట పునరావాస పనులు చేపడతాం. ఇవి దశలవారీగా జరుగుతాయి. ఇందుకు రూ.3,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఆ తర్వాత విడతల వారీగా 45.72 మీటర్లకు నీటి నిల్వ పెంచుతూ పోతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు ఎత్తును అంగుళం కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు.


సోమవారం పోలంరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన ఆయన.. వివిధ పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే, కాంక్రీట్‌ స్లాబ్‌ పనులు, కాఫర్‌ డ్యాం పనులను స్వయంగా చూశారు. అనంతరం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రాధాన్య క్రమంలో దశల వారీగా పునరావాస కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఫిబ్రవరి-మార్చికల్లా వీటిని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలో దశల వారీగానే నీటి నిల్వ ఉంటుందని.. దేశంలో ఎక్కడా ప్రాజెక్టు కట్టినా మొదటి ఏడాదే నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయరని జగన్‌ తెలిపారు. భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుందని.. మొదటి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం వరుసగా మూడో ఏడాది పూర్తిగా నీటిని నిల్వ చేస్తారని.. ఇది కేంద్ర జలసంఘం నియమమని విశదీకరించారు. అయితే పోలవరం పరిధిలో 41.5 మీటర్ల తొలి దశలోనే ఏకంగా 120 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. ఇంతకుముందు పలు ప్రాజెక్టుల విషయంలో సహాయ పునరావాస కార్యక్రమాల(ఆర్‌అండ్‌ఆర్‌)ను పట్టించుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని.. అలాంటి పరిస్థితి పోలవరానికి ఎదురుకాకూడదని అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గదని.. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


నిధుల కొరత లేదు..

సమీక్షా సమావేశంలో బిల్లుల ప్రస్తావన వచ్చింది.  నిధుల కొరత లేదని.. ఆ విషయం తాను చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. 2018 నాటి బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని.. అందుచేత చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు సమర్పించాలని, ఇందులో జాప్యం లేకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించారు. కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ కాకుండా జాతీయ ప్రాజెక్టు హోదా రీత్యా కొంత మొత్తాన్ని రిజర్వులో పెట్టాల్సిన అవసరం ఉందని.. దీనిపై పీపీఏ దృష్టి సారించాలని అధికారులు చెప్పగా.. కేంద్రం నుంచి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని సీఎం అన్నారు. కాగా.. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వివరించారు. సహాయ పునరావాసంపై కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ బాబూరావునాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో భూసేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని ఆ జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పారు.


కాగా.. ప్రధాన డ్యాం నిర్మాణంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ, పీపీఏ, కేంద్ర జల సంఘం అధికారులు ఇందులో ఉంటారని.. డిజైన్లు, మోడళ్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు అనిల్‌కుమార్‌, పేర్ని నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉభయగోదావరి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు

పోలవరం, డిసెంబరు 14: పోలవరం వచ్చిన సీఎం జగన్‌కు తమ గోడు చెప్పుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పోలవరం నిర్వాసితులు, పారిశుధ్య కార్మికులు, జలవనరుల శాఖ లష్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేందుకు నిర్వాసితుల తరఫున కొందరికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన పలువురు నిర్వాసితులు ప్రాజెక్టు కార్యాలయం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరు పారిశుధ్య కార్మికులకు అపాయింట్‌మెంట్‌ వచ్చినా పోలవరం పోలీసు స్టేషన్‌ వద్ద వారిని నిర్బంధించారు.


గోదావరి జిల్లాల్లో లష్కర్లుగా పనిచేస్తున్న 610 మందికి 16 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని.. సీఎంను  కోరేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మీడియా వాహనాలను వెళ్లనివ్వాలని ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ ఆదేశించినా.. పోలీసులు అత్యుత్సాహంతో నిలిపివేయడంతో మీడియా ప్రతినిధులు సీఎం పర్యటనను పూర్తిస్థాయిలో కవర్‌ చేయలేకపోయారు. వైసీపీ నేతలను కూడా వెళ్లనివ్వకపోవడంతో వారూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


జూన్‌లోగా యుద్ధప్రాతిపదికన పనులు..

వచ్చే 2022 ఖరీఫ్‌ కల్లా సాగునీరిచ్చేలా ప్రణాళిక, కార్యాచరణ ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది డిసెంబరుకల్లా పనులు పూర్తి కావల్సిందేనని, చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించడానికి రాబోయే 2-3 నెలల సమయం పనికి వస్తుందని తెలిపారు. ‘మళ్లీ జూన్‌ నుంచి గోదావరిలో నీళ్లు వస్తాయి.. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఎక్కడ పొరపాట్లు జరిగినా పనులు ఒక సీజన్‌ ఆలస్యమవుతాయి. మే నెలాఖరు నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తి కావాలి. సమాంతరంగా కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు మూసివేసే సమయంలో గోదావరి డెల్టాకు సాగు, తాగునీటికి కొరత రాకుండా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికను ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేసి.. వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులు కూడా ఇదే సమయంలో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-15T09:04:26+05:30 IST