పోలవరం అంచనాలపై.. కేంద్రం ఏం చెబుతుందో?

ABN , First Publish Date - 2020-12-11T07:34:26+05:30 IST

పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంపై కేంద్రం వైఖరేమిటో శుక్రవారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం సమావేశం

పోలవరం అంచనాలపై.. కేంద్రం ఏం చెబుతుందో?

నేడు నిర్మలా సీతారామన్‌, షెకావత్‌ భేటీ

బుగ్గన, దాస్‌, రావత్‌ కూడా హాజరు


అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంపై కేంద్రం వైఖరేమిటో శుక్రవారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా పాల్గొననున్నారు. 2017-18 సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు కేంద్రం ఆమోదిస్తుందా.. లేక 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన 2013-14 అంచనా రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని అంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి ఈ సమావేశం గురువారమే జరగాల్సి ఉండగా.. షెకావత్‌ రాజస్థాన్‌ నుంచి రాలేకపోవడంతో శుక్రవారానికి వాయిదాపడింది.


పోలవరం ప్రాజెక్టుకు 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇవ్వగలమని.. దీనిని రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది. పీపీఏ అత్యవసర భేటీలో కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని అథారిటీ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అయితే.. 2017-18 ధరల మేరకు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు .. దానిపై సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జల సంఘం అభిప్రాయపడింది.


కాగా.. 2017-18 సవరించిన అంచనాల మేరకు రూ.47,725.74 కోట్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో గట్టిగా కోరింది. రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేయలేమని.. భూసేకరణ, సహాయ పునరావాసానికే రూ.28,000 కోట్ల వరకూ వ్యయమవుతుందని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారు. అయితే అంచనా వ్యయం విషయంలో కేంద్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.

Updated Date - 2020-12-11T07:34:26+05:30 IST