అదే మాట!

ABN , First Publish Date - 2020-10-27T08:27:02+05:30 IST

పోలవరం ప్రాజెక్టులో ‘సాగునీటి’కి సంబంధించిన నిర్మాణాల ఖర్చు (ఇరిగేషన్‌ కాంపొనెంట్‌)మాత్రమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

అదే మాట!

2013-14 అంచనా 29,027 కోట్లు

2014 జనవరి నుంచి పెట్టిన వ్యయమే భరిస్తాం

‘ఇరిగేషన్‌ కాంపొనెంట్‌’కు మాత్రమే పరిమితం

పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టీకరణ

సమాచార హక్కు చట్టం కింద సమాధానం

వచ్చేనెల 2న అత్యవసర సమావేశం

రూ.55,548 కోట్లు కోరుకుంటున్న రాష్ట్రం

గట్టిగా పోరాడితే తప్ప ప్రయోజనం లేనట్లే!


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో ‘సాగునీటి’కి సంబంధించిన నిర్మాణాల ఖర్చు (ఇరిగేషన్‌ కాంపొనెంట్‌)మాత్రమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం  కింద అడిగిన ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమాధానం ఇచ్చింది. ‘ఈ ప్రాజెక్టు వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర ఏమిటి?’ అని ప్రశ్నించగా... ‘‘కేంద్ర ప్రభుత్వం 2014 జనవరి 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ ఖర్చును మాత్రమే వంద శాతం భరిస్తుంది. కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది’’ అని కేంద్రం జవాబు చెప్పింది. 2234.77 కోట్ల వ్యయాన్ని రీఇంబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపింది. అంచనా వ్యయాల గురించి ప్రశ్నించగా... ‘‘2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 29,027.95 కోట్లు. 2017-18లో ఇది రూ.47,725 కోట్లకు చేరింది’’ అని కేంద్రం తెలిపింది.భూసేకరణ, పునరావాసం 19.85 శాతం పూర్తయిందని తెలిపింది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనులు 71.54 శాతం పూర్తయ్యాయని పేర్కొంది. 


 2న అత్యవసర భేటీ...

పోలవరం అంచనా ‘పంచాయతీ’ వచ్చేనెల 2వ తేదీన ఢిల్లీలో జరగనుంది. 2013-14 అంచనాలే ఫైనల్‌ అని, రాష్ట్ర విభజనకు ముందు పెట్టిన వ్యయాన్ని భరించబోమని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన... రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయానికే కట్టుబడి ఉంటామని కేంద్రం తెలిపింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం... భూసేకరణ వ్యయం, నిర్వాసితుల పునరావాసం కలిపి రూ.55,548 కోట్లకు చేరింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సాంకేతిక సలహా సంఘం (టీఏసీ) గత ఏడాది ఫిబ్రవరిలో దీనిని ఆమోదించింది కూడా! ఇప్పుడు అకస్మాత్తుగా 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేయడం ప్రకంపనలు సృష్టించింది.


ఇందుకు అంగీకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.2234.288 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని షరతు కూడా విధించింది. ఈ అంశంపై నవంబరు 2న అత్యవసర సమావేశం నిర్వహించాలని పీపీఏ నిర్ణయించింది. 2019 ఫిబ్రవరిలో టీఏసీ ఆమోదించిన రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశముంది. ఇందుకు పీపీఏ అంగీకరించే అవకాశాలు లేకపోవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ గట్టిగా గళం విప్పి, పట్టుబడితే తప్ప కేంద్రం దీనిపై దిగివచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే... కేంద్రాన్ని నిలదీసే సంగతి పక్కనపెట్టి, నెపాన్ని చంద్రబాబు సర్కారుపై నెట్టే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి.

Updated Date - 2020-10-27T08:27:02+05:30 IST