పోలవరం అంచనా 33 వేల కోట్లే

ABN , First Publish Date - 2020-09-24T07:45:59+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సాగిలపడుతున్నట్లు కనిపిస్తోందని జలవనరుల నిపుణులు ఆరోపిస్తున్నారు. భూసేకరణ

పోలవరం అంచనా 33 వేల కోట్లే

ఇది కేంద్ర ఆర్థిక శాఖ లెక్క..

55,548 కోట్లకు ఫిబ్రవరిలోనే టీఏసీ ఆమోదం

తర్వాత భూసేకరణ ఖర్చులో కోత..

అంచనా వ్యయం 47,725 కోట్లకు ఓకే

అందులోనూ ఇప్పుడు భారీగా 14 వేల కోట్లకుపైగా కుదింపు!

రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు?..

ఒత్తిడి తేవడానికి జగన్‌ సర్కారు దూరం


 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సాగిలపడుతున్నట్లు కనిపిస్తోందని జలవనరుల నిపుణులు ఆరోపిస్తున్నారు. భూసేకరణ, సహాయ పునరావాస వ్యయంలో భారీగా కోతపెట్టినా నోరెత్తడం లేదని.. హెడ్‌వర్క్స్‌ పూర్తి చేసేందుకు కావలసిన రూ.4,000 కోట్లను కేంద్రం ఇస్తేచాలని, పునరావాసం  తర్వాత చూసుకుందామన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. నిజానికి కేంద్ర జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు నిరుడు ఫిబ్రవరిలోనే ఆమోదించింది. ఇప్పుడు అదే శాఖ ఈ అంచనాల్లో భారీ కోతపెట్టి రూ.47,725.74 కోట్లకు పరిమితం చేసింది. కుదించిన అంచనాలకు రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. దీంతో రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయం ఫైలు కేంద్ర ఆర్థికశాఖకు చేరింది.


ఆర్థికశాఖ ఈ వ్యయాన్ని తనదైన శైలిలో మదింపు చేసి.. రూ.33 వేల కోట్లకే సమ్మతి తెలిపే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 14,725 కోట్ల మేర భారీగా కోత వేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం ఉన్నా.. వ్యతిరేకించకుండా ఎంతో కొంత ఇస్తే చాలన్న ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని.. రాష్ట్రానికి భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు.  2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ తర్వాత ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయమంతటినీ భరిస్తానని విభజన చట్టంలోనే అంగీకరించింది. ఇప్పటివరకూ టీఏసీ ఆమోదించిన రూ.55, 548.87 కోట్లకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయలేదు. ఈ ఏడాది మార్చిలో ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయాలని కేంద్రాన్ని కోరినప్పుడు.. భూసేకరణ వ్యయాన్ని కుదించుకుంటేనే రూ.1,850 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని మెలికపెట్టింది. దీనికి రాష్ట్రప్రభుత్వం ఆమోదించాకే ఆ మొత్తాన్ని విడుదల చేసింది.




కొద్దిరోజుల కింద కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ఢిల్లీలో రాష్ట్ర జల వనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమయంలోనూ భూసమీకరణ వ్యయాన్ని కుదించుకోవాల్సిందేనని షెకావత్‌ షరతు విదించారు. ఇందుకు రాష్ట్రం సరేననడంతో కుడి ప్రధాన కాలువ అంచనా వ్యయంలో రూ.4,318.97 కోట్లలో రూ.1,453.33 కోట్లు తగ్గించి.. 2,865.75 కోట్లకు ఖరారుచేసింది. ఎడమ ప్రధాన కాలువ ఖర్చు రూ.4,202.69 కోట్ల నుంచి రూ.2,749.36 కోట్లకు కుదించింది. హెడ్‌వర్క్స్‌కు రూ.9734.34 కోట్లను యధాతథంగా ఆమోదించింది.


భూ సేకరణకు అంచనా వేసిన రూ.33,168.23 కోట్లతో జలశక్తి శాఖ విభేదించింది. రూ.28,172.21 కోట్లకే అంగీకారం తెలిపింది. మొత్తానికి రూ.47,725.74 కోట్లకు కుదించిన అంచనా వ్యయం ఫైలును కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇది మంగళవార మే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వద్దకు వెళ్లిం ది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం ఢిల్లీలో ఆమెతో సమావేశం కానున్నారు.


ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరవరలు, భూసేకరణ వ్యయం ఎందుకు పెరిగిందో.. సంపూర్ణ వివరాలు కేంద్రం ముం దుంచి ఒత్తిడి తెస్తేనే ఫలితం ఉంటుందని.. లేదంటే భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి కావడం కష్టమని.. రాష్ట్ర ప్రయోజనాలకు భారీ నష్టమని నిపుణులు చెబుతున్నారు.




పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్ల నుంచిర కేంద్ర జలశక్తి శాఖ 47,725 కోట్లకు కుదిస్తే రాష్ట్రప్రభుత్వం కిమ్మనకుండా సమ్మతించింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా తెగ్గోసి రూ.33 వేల కోట్లుగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-09-24T07:45:59+05:30 IST