పోలవరం ఖర్చు బాధ్యత మీదే!

ABN , First Publish Date - 2020-11-07T09:14:24+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

పోలవరం ఖర్చు బాధ్యత మీదే!

అంచనాల కోతపై పునఃసమీక్షించండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు బుగ్గన వినతి

టీడీపీ ప్రభుత్వం వల్లే ఈ కష్టాలు

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆరోపణ


న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణానికి పెరిగిన తాజా అంచనా వ్యయాన్ని ఆమోదించే విషయంలో పునరాలోచన చేయాలని, నిధుల కోతను పునఃసమీక్షించి, ఆంధ్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. పెరిగిన అంచనాలకు లోబడి మొత్తం నిధులు సమకూర్చాలంటూ.. ప్రాజెక్టు పూర్వాపరాలపై ఆమెకు  వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టుకయ్యే అదనపు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదని బుగ్గన ఆమెకు తెలిపారు.


విభజన చట్టం ప్రకారం దీనిని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినందువల్ల.. పెరిగిన అంచనా వ్యయం కేంద్రమే భరించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై తాజా పరిస్థితులన్నీ నిర్మలా సీతారమన్‌కు వివరించానని.. ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.12 వేల కోట్లలో రూ.8 వేల కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేసిందని.. మిగతా రూ.4 వేల కోట్లలో రూ.2,234 కోట్లను విడుదల చేయడానికి గతవారంలోనే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించిందని తెలిపారు. 2013-14నాటి అంచనాల వ్యయానికే పరిమితమవుతామని, అంతకంటే  అదనంగా అయ్యే ఖర్చును తామే భరిస్తామని గత టీడీపీ ప్రభుత్వం 2016-17లో కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయని ఆరోపించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కేంద్ర మంత్రిమండలి భేటీలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే పెరిగే అంచనా వ్యయాన్నంతా కేంద్రమే భరిస్తుందని కూడా తీర్మానించిందన్నారు.


భూసేకరణకు, పునరావాసంతోపాటు పెరిగిన పరిహారం, కమాండ్‌ ఏరియాకు అయ్యే అదనపు వ్యయాన్ని తామే ఖర్చు చేస్తామని కేంద్రం అప్పట్లో చెబితే.. చంద్రబాబు ప్రభుత్వం 2013-14 వ్యయానికే పరిమితమవుతామని ఒప్పుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి అప్పగిస్తారా అని అడుగగా.. ప్రాజెక్టు పురోగతిలోనే ఉంది గనుక తామే చేపడతామని చెప్పారు. అంతకు ముందు ఆయన పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాతో భేటీ అయ్యారు. భోగాపురం విమాన్రాశయంతోపాటు ఇతర విమానాశ్రయాల విస్తరణ పనులపై చర్చించారు.

Updated Date - 2020-11-07T09:14:24+05:30 IST