కేంద్రానికిస్తే కదిలేనా?

ABN , First Publish Date - 2020-10-31T07:20:44+05:30 IST

పోలవరం సీమాంధ్రుల జల-జీవ నాడి! అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకూ జలాధారం! అందుకే...

కేంద్రానికిస్తే కదిలేనా?

జాతీయ హోదా ప్రాజెక్టుల నత్తనడక.. ఇతర రాష్ట్రాల్లో దీనంగా వాటి స్థితి

వాటిని చూసే పోలవరంపై రాష్ట్ర నిర్ణయం

నిర్మాణ బాధ్యత చేపట్టిన టీడీపీ ప్రభుత్వం

72ు పూర్తయింది ఒక్క పోలవరమే

నిధులిస్తే 2022 ఏప్రిల్‌కు పూర్తయ్యే చాన్సు

మిగతా జాతీయ ప్రాజెక్టుల్లో ఒక్కటి తప్ప..

ఏదీ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశమే లేదు!

ఏ రాష్ట్రానికీ లేని ఆలోచన మనకెందుకో ? 

సాగునీటి నిపుణుల్లో విస్మయం


‘‘అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తాం! నాడు కమీషన్లకోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును తీసుకున్నారు’’.. ఇదీ వైసీపీ సర్కారు పెద్దల తాజా వైఖరి!  వీరు చెప్పినట్లుగానే పోలవరం పనులను కేంద్రానికి అప్పగిస్తే ఏమవుతుందో తెలుసా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జాతీయ హోదా పొంది, కేంద్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టిన 15 ప్రాజెక్టుల్లాగా పోలవరం కూడా నత్త నడక నడుస్తుంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని తికమకలో పడుతుంది. అయినా... పోలవరాన్ని కేంద్రానికే అప్పగించాలని రాష్ట్రం నిర్ణయించుకుంటే, కేంద్రం నిధులివ్వడం లేదన్న సాకుతో పోలవరాన్ని వదిలించుకోవడమే అవుతుందని నిపుణులు అంటున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి):పోలవరం సీమాంధ్రుల జల-జీవ నాడి! అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకూ జలాధారం! అందుకే... పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. జాతీయ హోదా ఉన్నప్పటికీ... నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపట్టింది. కేంద్రానికి వదిలేస్తే... అప్పటికే జాతీయ హోదా పొందిన అనేక ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటవుతుందని... నిర్మాణం నత్తనడకన సాగుతుందని భావించింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించాలని కేంద్రానికి విన్నవించింది. అందుకు కేంద్రం కూడా అంగీకరించి నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఇదే సమయంలో తన తరఫున పర్యవేక్షించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది.


రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్ర జలసంఘం, జలశక్తి శాఖ, ఆర్థిక శాఖ నిశితంగా పరిశీలించాకే రీయింబర్స్‌ చేస్తోంది. అంటే అడుగడుగునా పర్యవేక్షిస్తున్నట్లే లెక్క. అంతేకాదు.. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ సకాలంలో పనులు చేయకపోవడంతో.. కొన్ని కీలక పనులను వేరే సంస్థకు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు నాటి కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించలేదు. చివరకు ట్రాన్‌స్ట్రాయ్‌తోపాటు ఆయన ఆమోదం కూడా తీసుకుని మరీ కాంక్రీటు పనులను వేరే సంస్థకు అప్పగించారు. దీని ఫలితంగానే పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు తీశాయి. ఇప్పుడు... అంతా తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అవసరమైతే కేంద్రానికే అప్పగించేస్తామని రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అదే జరిగితే పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉండదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం సత్వర సాగునీటి పథకం (ఏఐబీపీ) కింద గతంలో గుర్తించిన 15 జాతీయ సాగునీటి, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణ దుస్థితిని గుర్తుచేస్తున్నారు. 


అలవిమాలిన నిర్లక్ష్యం..

ఏఐబీపీ కింద గుర్తించిన జాతీయ ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్రం భరిస్తే.. మిగిలిన పదిశాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేయాలి. పోలవరం సహా.. దేశవ్యాప్తంగా 16 జాతీయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. 2007-2012 మధ్య కాలంలో.. అంటే ఏడేళ్లలో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకుంది. అంతర్రాష్ట్ర జల వివాదాల కారణంగా నిలిచిపోతున్న (2000 హెక్టార్లకు పైగా సాగునీరందించే) ప్రాజెకులకు.. చట్టబద్ధమైన సంబంధిత సంస్థల అనుమతుల్లో జాప్యం లేకుండా చూసే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి.. నిర్మాణ పనులు ఆగకుండా నిధుల ప్రవాహాన్నీ తానే పారించాలి. ఏఐబీపీ మార్గదర్శకాలు ఇంత స్పష్టంగా ఉన్నా అమలులో మాత్రం కేంద్రం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు ఏఐబీపీ ప్రాజెక్టుగా గుర్తించడానికే సంవత్సరాలు తీసుకుంటోంది. తీరా గుర్తించాక.. డీపీఆర్‌ తయారీ ఒక ప్రహసనం. తర్వాత కేంద్ర జల సంఘం, కేంద్ర విద్యుత్‌ సంస్థ, నేషనల్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) వంటి సంస్థల కర్ర పెత్తనం.. ఇవన్నీ జరిగాక.. పర్యావరణ అనుమతుల విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో వివాదాలు వస్తే.. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు కేంద్రం చొరవ చూపడం లేదు.


ఈ పరిస్థితులను గమనించాక అత్యంత కీలకమైన ప్రాజెక్టులను కేంద్రానికి ఇవ్వడం బాధ్యతారహితమని ఆయా రాష్ట్రాలు గుర్తించాయి. నిర్మాణ బాధ్యతలను తాము తీసుకుంటే తప్ప అవి ఎప్పటికీ పూర్తికావని భావించి.. చేపట్టాయి. అయినా వాటిలో ఒక్కటీ ఇంతవరకు పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టు మాత్రమే ఇప్పటివరకు 72 శాతం నిర్మాణం పూర్తిచేసుకుంది. నిధుల ప్రవాహం బాగుంటే.. 2022 ఏప్రిల్‌కు పూర్తయ్యే అవకాశముంది. మిగిలిన 15 ప్రాజెక్టుల్లో మహారాష్ట్రలోని గోసిఖుర్ద్‌ తప్ప ఇంకేవీ కనుచూపుమేరలో పూర్తయ్యే సూచనలే కనిపించడం లేదని జలవనరులు, విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. అయినా ఆ రాష్ట్రాలు వాటిని కేంద్రానికి ఇచ్చే యోచన చేయడం లేదని.. మన రాష్ట్ర పాలకులకు ఈ ఆలోచన ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాలే స్వయంగా నిర్మాణ పనులు చేపడుతున్నా.. చాలా పథకాలు ముందుకు కదలడం లేదని.. డీపీఆర్‌ తయారీ దశలోనే ఇంకా పలు ప్రాజెక్టులు ఉన్నాయంటే.. వాటి దుస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 72 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి ఇస్తే ఇక అంతేనని తేల్చిచెబుతున్నారు.


పోలవరం ప్రత్యేకం..

పోలవరాన్ని ఏఐబీపీ కింద 2007లోనే గుర్తించినా.. పెద్దగా ముందుకు నడవలేదు. 2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లను ఎస్‌ఎ్‌సఆర్‌గా తీసుకుంటామని పేర్కొంది. కానీ 2014లో భూసేకరణ చట్టం-2013 అమల్లోకి రావడంతో భూసేకరణ పరిహారం, పునరావాస వ్యయం భారీగా పెరిగాయి. నిజానికి భూసేకరణ 2004లోనే పూర్తిచేసి ఉంటే పరిహారం, సహాయ పుననావాసం వ్యయం రూ.2,800 కోట్లకే పరిమితమై ఉండేది. అది 2010-11కి రూ.2,934.42 కోట్లకు చేరుకుంది. 2014లో భూసేకరణ చట్టం అమల్లోకి రావడంతో అమాంతం రూ.33,225.74 కోట్లకు చేరుకుంది. ఆ చట్టం మేరకు.. పరిహారం మార్కెట్‌ రేటుకు రెండున్నర రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండినవారందరినీ లబ్ధిదారులుగా గుర్తించాలి. అయితే రూ.33,225.74 కోట్ల భారాన్ని భరించేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ప్రాజెక్టు ప్రధాన పనులు, భూసేకరణ పరిహారం, సహాయ పునరావాసం అన్నీ కలిపి 2013-14 అంచనాల ప్రకారం రూ.20,398 కోట్లే ఇస్తామని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను దానికే అప్పగిస్తే.. చివరకు చేతులెత్తేసినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


నీతి ఆయోగ్‌ ఏమంది..?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు కేంద్రం పీపీఏని ఏర్పాటు చేసింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ ఇంత భారీ ప్రాజెక్టును చేపడితే తీవ్ర జాప్యం జరుగుతుందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టును చేపట్టాలన్న ఉత్సాహం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉందని.. త్వరగా నిర్మించాలన్న పట్టుదలా ఉందని పేర్కొంది. దాని సిఫారసు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రం చేపట్టేందుకు.. పర్యవేక్షణ పీపీఏ చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అయితే జాతీయ హోదా ప్రాజెక్టులన్నీ కేంద్రమే నిర్మిస్తోందని.. పోలవరం ప్రాజెక్టును అనవసరంగా టీడీపీ సర్కారు తీసుకుందని రాజకీయంగా వస్తున్న విమర్శలను నిపుణులు తోసిపుచ్చుతున్నారు. దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టులనూ ఆయా రాష్ట్రాలే నిర్మిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. 


అడ్డంకులు వచ్చినా పోలవరం పూర్తి.. మంత్రి అనిల్‌ కుమార్‌ 

నెల్లూరు జడ్పీ, అక్టోబరు 30: ‘‘ఎన్ని అడ్డంకులు వచ్చినా, పోరాటాలు చేసైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం’’ అని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరానికి గత అంచనాలనే ఖాయం చేస్తూ 2017లో చంద్రబాబు పంపిన లేఖ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘లోకేశ్‌.. జగన్‌ను గోచీతో నిలబెడతానంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలే గోచీతో నిలబెట్టారన్న సంగతి, మంగళగిరిలో లోకేశ్‌కు దాన్ని కూడా తీసేశారనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నాడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more