ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలపై ప్రధాని మోదీ ట్వీట్
ABN , First Publish Date - 2020-10-15T02:58:08+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సానికి సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులపై..

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సానికి సంబంధించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్‌లతో మాట్లాడినట్లు ఆయన ట్వీట్‌లో వివరించారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ ట్వీట్‌ను తెలుగులోనే చేయడం గమనార్హం.
ఇక.. తెలంగాణలో అన్నిచోట్ల మంగళవారం రోజంతా విరామం లేకుండా వాన దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వర్షం పడింది. వాగులు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు, కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. పలుచోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో 31.9సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 29.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలో కూడా వర్షం బీభత్సమే సృష్టించింది. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో ప్రవాహం పెరిగింది. గాలులు, వర్షాలకు తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. వర్ష బీభత్సానికి కోస్తాంధ్రలో జనజీవనం స్తంభించిపోయింది.