రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ!

ABN , First Publish Date - 2020-05-11T09:02:25+05:30 IST

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ లేదు. ఇప్పుడప్పుడే వైరస్‌ నివారణ సాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మందులతోనే వైర్‌సను కట్టడి చేస్తున్నాయి.

రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ!

  • కరోనాకు ప్రత్యేక చికిత్స
  • ముందస్తు ఏర్పాట్లలో ఆరోగ్యశాఖ
  • ప్లాస్మా స్టోరేజ్‌కు సన్నాహాలు
  • తిరుపతి, కర్నూలు వైద్యశాలల్లో 
  • ప్లాస్మా నిల్వకు ప్రభుత్వ అనుమతి
  • చికిత్స పొందుతున్నవారికి అవగాహన
  • పలు రాష్ట్రాలూ దీనిపై దృష్టి
  • ఐసీఎంఆర్‌ అనుమతి కోసం నిరీక్షణ

అమరావతి మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ లేదు. ఇప్పుడప్పుడే వైరస్‌ నివారణ సాధ్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మందులతోనే వైర్‌సను కట్టడి చేస్తున్నాయి. వైరస్‌ సోకిన వ్యక్తికి అజిత్రోమైసిన్‌, హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మందు బిళ్లలు ఇస్తున్నారు. అయితే, ఇదంతా తాత్కాలిక వైద్యమే. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా ప్లాస్మా థెరపీని కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వచ్చి తగ్గిన వ్యక్తి నుంచి యాంటీబాడీలు తీసి కరోనా ఉన్న వ్యక్తికి ఎక్కిస్తారు. దీనివల్ల వారిలో వ్యాధినిరోధక శక్తి పెరిగి వైరస్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 దేశాలు అమలు చేస్తున్నాయి. సార్స్‌, స్వైన్‌ఫ్లూ వంటి వాటికి ఈ విధానాన్నే అనుసరించారు.


వైరస్‌ నియంత్రణకు మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్లాస్మా థెరపీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్లాస్మా స్వీకరించి, బ్లడ్‌ బ్యాంక్‌లలో స్టోర్‌ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ప్లాస్మా థెరిపీని అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్లాస్మా శాంపిల్స్‌ తీసుకుని స్టోర్‌ చేసుకునేందుకు తిరుపతిలోని స్విమ్స్‌, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు సర్కారు అనుమతిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎవరి నుంచీ ప్లాస్మా సేకరించలేదు. త్వరలోనే సేకరణను ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్లాస్మాను మైనస్‌ 40 డిగ్రీల వద్ద స్టోర్‌ చేయాల్సి ఉంది. 


కోలుకున్న వారే రక్షకులు

రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా నుంచి 999 మంది వరకు కోలుకున్నారు. అయినప్పటికీ వీరి నుంచి ఇప్పటికిప్పుడు ప్లాస్మా తీసుకునే పరిస్థితి లేదు. కరోనా నుంచి కోలుకోవడానికి ఒక వ్యక్తికి సుమారు 14 రోజుల సమయం పడుతుంది. 14 రోజుల తర్వాత యాంటీజెన్‌ టెస్ట్‌ చేసి బాడీలో వైరస్‌ లేకపోతే అతనిని నెగిటివ్‌గా నిర్ధారిస్తున్నారు. ఇలా రెండుసార్లు చేసిన తర్వాతే ఆ వ్యక్తిని హాస్పిటల్స్‌ నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్నారు. మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. ఆ తర్వాత మరోసారి కరోనా పరీక్ష నిర్వహిచి నెగిటివ్‌ వస్తే వారి దగ్గర నుంచి ఫ్లాస్మా తీసుకుంటారు.


ఒక వ్యక్తి కరోనా నుంచి బయటపడిన రెండు వారాల్లోపు ప్లాస్మాను తీయాల్సి ఉంటుంది. రెండు వారాలు దాటితే కరోనాపై యుద్ధం చేసే యాంటీబాడీలు ప్లాస్మా నుంచి తొలగిపోతాయి. కాబట్టి కరోనా నుంచి బయటపడ్డ వ్యక్తి నుంచి రెండు వారాల్లోపు ప్లాస్మాను సేకరించేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారికి చికిత్స సమయంలోనే ప్లాస్మా థెరఫీపై అవగాహన కల్పిస్తున్నారు. 


ప్లాస్మా ఇస్తే మంచిదే

మన రక్తంలో 70% నీరు, 30% వివిధ రక్త కణాలుంటాయి. 70% ఉన్న వాటర్‌నే ప్లాస్మా అంటారు. ఇదే యాంటీబాడీగా పని చేస్తుంది. ప్లాస్మాను ఒకరి నుంచి తీసిన గంట వ్యవధిలో మళ్లీ పునరుత్పత్తి అవుతుంది. ప్లాస్మాను తీయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒకసారి ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి మూడు వారాల తర్వాత మళ్లీ ఇవ్వవచ్చు. ప్లాస్మా సేకరణకు ప్రభుత్వం రూ.10 వేల వరకు ఖర్చు చేస్తుంది.  

Updated Date - 2020-05-11T09:02:25+05:30 IST