ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు పిల్‌

ABN , First Publish Date - 2020-12-11T07:14:05+05:30 IST

ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 2018లో

ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు పిల్‌

జోక్యం చేసుకోడానికి హైకోర్టుబెంచ్‌ నిరాకరణ

తామే పర్యవేక్షిస్తున్నామని స్పష్టీకరణ


హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 2018లో జీవో ఇచ్చి అవసరమైన సిబ్బందిని నియమించలేదంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) దాఖలు చేసిన పిల్‌పై జోక్యం చేసుకోడానికి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తామే ఆయా కేసులను పర్యవేక్షిస్తున్నందున ఈ వ్యాజ్యంలో ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వాదిస్తూ... నేతలపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు 2018లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ప్రత్యేక కోర్టు బాధ్యతలు ఇన్‌చార్జి జడ్జికి అప్పగించారని తెలిపారు. కోర్టులో ఇద్దరు సిబ్బందిని మాత్రమే నియమించారని, కేసుల విచారణకు పోలీసులు సహకరించడం లేదని పేర్కొన్నారు.


ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. కొవిడ్‌-19 కారణంగా కొంత మందగమనం ఉందని, అయితే ఆయా కేసులను తామే స్వయంగా పర్యవేక్షిస్తున్నాని స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చామని గుర్తుచేసింది. పోలీసులు సహకరించడం లేదనడం సరికాదని, ఈ అంశంపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపింది. ఈ వ్యాజ్యంలో నోటీసులు ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం.. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.

Updated Date - 2020-12-11T07:14:05+05:30 IST