ఆయువు తీసే వాయువు!

ABN , First Publish Date - 2020-05-08T10:25:37+05:30 IST

ఏమిటీ స్టైరిన్‌! ఎందుకు, ఎలా ప్రమాదకరం! దీనిపై విశాఖపట్నంలోని పెట్రో యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌, పొల్యూషన్‌ ఇంపాక్ట్‌ ..

ఆయువు తీసే వాయువు!

‘స్టైరిన్‌’ చాలా ప్రమాదకరం

గాలిలో ఆక్సిజన్‌ను మిగేస్తుంది

ప్రాణాలను హరించేస్తుంది

‘ఆంధ్రజ్యోతి’తో పెట్రో వర్సిటీ వీసీ వీఎస్‌‌ఆర్‌కే ప్రసాద్‌


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ఏమిటీ స్టైరిన్‌! ఎందుకు, ఎలా ప్రమాదకరం! దీనిపై విశాఖపట్నంలోని పెట్రో యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌, పొల్యూషన్‌ ఇంపాక్ట్‌ ఎసె్‌సమెంట్‌ కమిటీ చైర్మన్‌ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పిన వివరాలివి...


క్రూడాయిల్‌ని శుద్ధి చేసిన తర్వాత వచ్చే ఉపఉత్పత్తుల్లో స్టైరిన్‌ ఒకటి. పాలిస్టిరీన్‌ తయారీకి దీనిని ముడిపదార్థంగా ఉపయోగిస్తారు. ఇది ద్రవరూపంలో ఉండే రసాయనం. నిర్దిష్ట ఉష్ణోగ్రత పెరిగితే ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. గాలిలో ఆక్సిజన్‌ను తనలో కలిపేసుకుంటూ వ్యాపిస్తుంది. వాయువు అలుముకున్న ప్రాంతంలో మనుషులు, జంతువులు ఆక్సిజన్‌ అందక విలవిల్లాడిపోతారు. దాన్ని పీలిస్తే క్షణాల్లో స్పృహ తప్పి పడిపోతారు. ఎక్కువ మోతాదులో పీలిస్తే ప్రాణం కూడా పోతుంది! 


స్టైరిన్‌ హైడ్రోకార్బన్‌ కుటుంబానికి చెందినది. సీ8హెచ్‌8 ఫార్ములాతో తయారవుతుంది. 

స్టైరిన్‌ నిల్వచేసే ట్యాంకుల వద్ద ఎక్కువ ఉష్ణోగ్రత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 

గాలిలో ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. ఇది భారవాయువు. వాతావరణంలో వెంటనే కలిసిపోదు. 

ఈ వాయువును పీలిస్తే మొదట మగతగా ఉంటుంది. కళ్లు మండుతాయి. దురద పెడుతుంది. వాంతులతో స్పృహ కోల్పోతారు. శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. గ్యాస్ట్రో ఎంట్రైటిస్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

దీని ప్రభావం 48గంటల వరకు తీవ్రంగా ఉంటుంది. వారం దాటితే గానీ సాధారణ పరిస్థితి రాదు. ఇలాంటి సమయాల్లో తుఫాను వస్తే.. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. బలమైన గాలులను యంత్రాల ద్వారా వీచేలా చూస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. 


రక్షణకు చర్యలివే..!

స్టైరిన్‌ లీక్‌ అయిన ప్రాంతం నుంచి అందర్నీ 5 కి.మీ. దూరం తరలించాలి.

500 మీటర్ల వరకు ఎక్కువగా, 2కి.మీ. వరకు ఓ మాదిరిగా ప్రభావం ఉంటుంది. 3 కి.మీ. దాటితే ఘాటైన వాసన తప్పితే ఆరోగ్యానికి ప్రమాదం ఉండదు. 

ప్రతి ఒక్కరూ దళసరి మాస్కును నీటితో తడిపి ముఖానికి కట్టుకోవాలి. కళ్లు మండకుండా అద్దాలు పెట్టుకోవాలి. ఐదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ వాయువు పీలిస్తే ప్రాణాపాయం.


ఇది కంపెనీ నిర్లక్ష్యమే!

స్టైరిన్‌ నిల్వ ట్యాంకుల వద్ద ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి పరికరాలు ఉంటాయి. సిబ్బంది వాటిని గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ట్యాంకులను చల్లబరచడానికి కూలర్లు ఉంటాయి. అది కాకుండా లీకైన స్టైరిన్‌ను నియంత్రించడానికి మెర్‌కేప్టాన్స్‌ అనే పౌడర్‌ చల్లుతారు. ఇవేవీ లేవంటే.. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్టే.

Updated Date - 2020-05-08T10:25:37+05:30 IST