ప్రజలపై పెట్రో మంట

ABN , First Publish Date - 2020-06-21T08:30:58+05:30 IST

రాష్ట్రంలో భానుడి ప్రతాపం తగ్గిందని కొంత ఊరటపొందుతున్న ప్రజలకు పెట్రో, డీజిల్‌ ధరలు అంతకుమించి మంట ..

ప్రజలపై పెట్రో మంట

15 రోజుల్లో లీటరుపై రూ.8 భారం

నాలుగు రోజులుగా ప్రతిరోజూ 

అర్ధ రూపాయి చొప్పున వడ్డన

రాష్ట్రంలో అదనపు వ్యాట్‌ మోత

ద్విచక్ర వాహనదారులకు చుక్కలు

అదనపు వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌


అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భానుడి ప్రతాపం తగ్గిందని కొంత ఊరటపొందుతున్న ప్రజలకు పెట్రో, డీజిల్‌ ధరలు అంతకుమించి మంట పుట్టిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత నుంచి వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన 15 రోజులుగా ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు కేంద్రం ధరలు పెంచుతూ వెళ్తుంటే, దానిపై రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యాట్‌ వడ్డిస్తోంది. దీంతో వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. గత నాలుగైదు రోజులుగా రోజూ అర్థరూపాయి చొప్పున ధరలు పెరిగాయి. అటు పెట్రోలు, ఇటు డీజిల్‌ రెండింటిపైనా అదే పెంపు కొనసాగుతోంది. గతంలో 15 రోజులకోసారి పెట్రో ధరల సవరణ విధానం ఉన్నప్పుడు పదిహేనురోజులకోసారి రూపాయి పెరిగితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేసేవారు.


అలాంటిది ఇప్పుడు రోజువారీ సవరణ విధానంలో గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.2కు పైగా ధరలు పెరిగాయి. గత 15 రోజుల్లో విజయవాడ ధరల ప్రకారం చూస్తే పెట్రోలుపై రూ.7.66, డీజిల్‌పై రూ.7.79 పెరిగింది. 15 రోజుల్లో ఈ స్థాయి పెంపు గతంలో ఎన్నడూ లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇది అటు వ్యక్తిగతంగా ప్రజలపై భారంగా మారడంతో పాటు సరుకు రవాణాపైనా తీవ్ర భారం మోపుతోంది. దీంతో త్వరలోనే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అసలే లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోవడం, జీతాల్లో కోతలతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పెట్రో భారం కష్టాలను రెట్టింపు చేస్తోంది. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలనే వినియోగిస్తున్నారు. అన్ని అవసరాలకు సొంత వాహనాలనే వాడుకోవాల్సిన సమయంలో ధరల పెంపుతో అల్లాడిపోతున్నారు.


కనిపించని వాతలు

ఈ నెల 5న పెట్రోలు ధర లీటరు రూ.74.21గా ఉంటే, శనివారం రూ.81.87కి చేరింది. గత 5 రోజులను తీసుకుంటే మంగళవారం 47 పైసలు, బుధవారం 56 పైసలు, గురువారం 53 పైసలు, శుక్రవారం 56 పైసలు, శనివారం 51 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. జూన్‌ 5న డీజిల్‌ ధర రూ.68.15గా ఉంటే శనివారానికి అది రూ.75.94కి చేరింది. మంగళవారం 54 పైసలు, బుధవారం 56 పైసలు, గురువారం 6 పైసలు, శుక్రవారం 59 పైసలు, శనివారం 58 పైసలు పెరిగాయి. ధరల సవరణ అంటే పెంపు, తగ్గింపు రెండూ ఉంటాయి. కానీ ఇటీవల సవరణ విధానం చూస్తే పెరుగుదల ఒక్కటే కనిపిస్తోంది. 15 రోజుల్లో ఒక్కరోజూ తగ్గకపోగా, పెరుగుదల భారీగా ఉండడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కేంద్రానికి రాష్ట్రం తోడు

పెట్రో ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు తోడైంది. కేంద్రం పెంపును ఆసరా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం లీటరకు పెట్రోలుపై 31ు, డీజిల్‌పై 22.5ు చొప్పున వ్యాట్‌ వసూలు చేస్తోంది. ఇది ఎప్పటినుంచో ఉన్నదే అయినా తాజాగా వైసీపీ ప్రభుత్వం అదనపు వ్యాట్‌ను పెంచింది. టీడీపీ ప్రభుత్వంలో లీటరుపై రూ.2 అదనపు వ్యాట్‌ ఉంటే వైసీపీ ప్రభుత్వం దాన్ని లీటరుకు పెట్రోలుపై రూ.2.76, డీజిల్‌పై రూ.3.07కు పెంచింది. అంటే లీటరు పెట్రోలుపై 76 పైసలు, డీజిల్‌పై 1.07 పైసలు అదనపు భారం మోపింది. తాజా ధరల పెంపు వల్ల సాధారణ వ్యాట్‌ కూడా పెరిగిపోయింది.


దీనివల్ల ప్రభుత్వానికి లీటరుకు పెట్రోల్‌పై రూ.20.26, డీజిల్‌పై రూ.15.58 ఆదాయం వస్తోంది. తాజా, ఐదు రోజుల పెంపును కలిపితే ఇది ఇంకా పెరుగుతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం అదనపు వ్యాట్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. ధరల పెంపు కేంద్రం పరిధిలో ఉన్నందున కనీసం వ్యాట్‌ అయినా తగ్గించి ప్రజలకు మేలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - 2020-06-21T08:30:58+05:30 IST