ఉత్సవాలు.. ఊరేగింపులకు ఓకే

ABN , First Publish Date - 2020-10-07T09:53:52+05:30 IST

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, ఊరేగింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 15 నుంచి వాటిని నిర్వహించుకోవచ్చంటూ పలు జాగ్రత్తలు, సూచనలతో

ఉత్సవాలు.. ఊరేగింపులకు ఓకే

మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఊరేగింపుల వెంట అంబులెన్స్‌ తప్పనిసరి

15వ తేదీ నుంచి థియేటర్లలో ప్రదర్శనలు

హాలు సామర్థ్యంలో 50ు ప్రేక్షకులకే అనుమతి

మల్టిప్లెక్స్‌ల్లో వేర్వేరు టైంలను ప్రకటించాలి

రద్దీ లేకుండా ఇంటర్వెల్‌ సమయం పెంపు

హాల్లో ఉష్ణోగ్రత 23 డిగ్రీల పైన ఉండాలి

స్కూళ్లకు వెళ్తున్నారా?.. జాగ్రత్తలు తప్పనిసరి


న్యూఢిల్లీ, అక్టోబరు 6: ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు, ఊరేగింపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 15 నుంచి వాటిని నిర్వహించుకోవచ్చంటూ పలు జాగ్రత్తలు, సూచనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో.. నిజ అశ్వయుజ మాసం (ఈ నెల 17 నుంచి) నేపథ్యంలోప్రారంభం కానున్న పండుగల సీజన్‌ కొత్తకళను సంతరించుకోనుంది. కంటైన్మెంట్‌ జోన్లలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు..


  1.  ఉత్సవాల సమయంలో భక్తులంతా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కు ధరించాలి. గాత్రకచేరీలు వంటివి జరపకుండా.. రికార్డింగ్‌ ద్వారా పాటలను పెట్టుకోవచ్చు.
  2.  మండపాలు, ఆలయాల్లోకి వెళ్లేప్పుడు భక్తులు పాదరక్షలను వాహనాల్లోనే వదలాలి. తప్పదనుకుం టే చెప్పుల స్టాండ్‌ వద్ద వేర్వేరుగా భద్రపరచాలి.
  3.  మండపాల ప్రాంగణాలను, భక్తులు కాళ్లు కడుక్కొ నే ప్రాంతాలను తరచూ శానిటైజ్‌ చేయాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
  4.  ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే.. ప్రాంగణాన్ని డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ర్పేతో శుద్ధి చేయాలి. మండపాలు, మతపరమైన సమావేశాలకు సమీపంలోని ఆస్పత్రుల వివరాలను నిర్వాహకులు తీసి పెట్టుకోవాలి.
  5.  ఊరేగింపుల్లో భక్తులను పరిమితంగా అనుమతించాలి. ఊరేగింపు వెంట అంబులెన్స్‌ ఉండాలి.
  6.  10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు సామూహికఉత్సవాల్లో పాల్గొనకపోవడం ఉత్తమం.


బడి పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులే ఉత్తమం

‘‘ఇంతకాలం ఇంటికే పరిమితమైన చిన్నారులు ఒక్కసారిగా స్కూళ్లకు వెళ్తే.. వారిని నియంత్రించడం సాధ్యం కాదు. తరగతి గదుల్లో భౌతిక దూరాన్ని పాటిస్తారా? మాస్కులు తీయకుండా ఉంటారా? అనేది చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. స్కూలుకు వెళ్లడం తప్పనిసరి కాదని కేంద్రం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులను పిల్లలు ఎంచుకోవచ్చని అంటున్నాయి. తల్లులకు ఇంట్లో కొంత ఇబ్బందే అయినా.. ఆన్‌లైన్‌ తరగతులను ప్రోత్సహించడమే మంచిది’’ అని పద్మశ్రీ డాక్టర్‌ మంజుల అన్నారు. 


  1. చిన్నారులకు పోషకాహార లోపం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం, ఆస్తమా, అలర్జీ, ఇతరత్రా వ్యాధులు ఉంటే ఆన్‌లైన్‌ తరగతులే ఉత్తమం.
  2. విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లి, తీసుకొచ్చే ఆటో/వ్యాన్‌ డ్రైవర్లు, ఆయాలు ఆరోగ్యంగా ఉన్నారా? అనే విషయాన్ని గమనించాలి.
  3. చిన్నారులను తీసుకొచ్చేందుకు స్కూళ్లకు వెళ్లే తల్లిదండ్రులు కూడా భౌతిక దూరాన్ని పాటించాలి. 
  4. పిల్లలు స్కూలు నుంచి రాగానే ఇంట్లో నానమ్మలు, తాతయ్యల దగ్గరకు వెళ్లకుండా చూడాలి. 


సినిమా థియేటర్లకు పచ్చజెండా

సినిమా థియేటర్లను ఈ నెల 15 నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు. సీటింగ్‌ సామర్థ్యంలో 50ు ప్రేక్షకులనే అనుమతించాలని, హాలులో వెంటిలేషన్‌ ఉండాల న్నారు. ఎయిర్‌ కండీషన్‌.. ఉష్ణోగ్రతను 23 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా, గాలిలోని తేమ 40-70ు ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రాలు వేరుగా మార్గదర్శకాలు విడుదల చేసుకోవచ్చన్నారు. కేంద్రం మార్గదర్శకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు..


  1. సినిమా థియేటర్లలోని పార్కింగ్‌ లాట్లు, ఫుడ్‌కోర్టులు, బాక్సాఫీసు, టాయ్‌లెట్స్‌, ఎంట్రీ/ఎగ్జిట్‌ వద్ద భౌతిక దూరాన్ని పాటించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరి. ప్రతి ప్రేక్షకుడు, థియేటర్‌ సిబ్బంది మాస్కు ధరించాలి. కాంటాక్ట్‌లెస్‌ శానిటైజర్ల వ్యవస్థను అందుబాటులో పెట్టాలి.
  2. ప్రతి షో తర్వాత థియేటర్‌ను శానిటైజ్‌ చేయాలి. సిబ్బంది పీపీఈ కిట్లు, బూట్లు, మాస్కులు, ఫేస్‌షీల్డులు, గ్లౌస్‌లను ధరించాలి.
  3. ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రోత్సహించాలి.
  4. ఫుడ్‌కోర్టుల వద్ద  డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. థియేటర్లలో ఫుడ్‌ సర్వ్‌ చేయకూడదు.
  5. ఎంట్రీ/ఎగ్జిట్‌ సమయంలో రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో.. షోల సమయాన్ని మార్చుకోవాలి. మల్టిప్లెక్స్‌లలో వేర్వేరు సమయాలు ఉండాలి. రద్దీ నివారణకు ఇంటర్వెల్‌ సమయాన్ని పెంచాలి.
  6. ప్రతి రెండో సీటును ఖాళీగా ఉంచాలి. దాన్ని మూసివేయడమో.. ‘భౌతిక దూరం’ స్టిక్కర్‌ పెట్టడమో చేయాలి.


దేశంలో తగ్గిన కరోనా కేసులు 

న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 61,267 మందికి పాజిటివ్‌ వచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఆగస్టు 26న 60,975 కేసులు రాగా.. ఆ తర్వాత నమోదైన అతి తక్కువ కేసులు ఇవే. తాజాగా 9.19 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా 75,787 మంది కోలుకున్నారు. దేశంలోని ప్రతి రెండు మరణాల్లో ఒకటి 8 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం పేర్కొంది. అసింప్టమాటిక్‌, మైల్డ్‌ కేసుల్లో చికిత్సకు సంబంధించి ఆయుర్వేద ప్రొటోకాల్‌ను మంగళవారం విడుదల చేసింది. వీరికి ఆయుర్వేద వైద్యులు చికిత్స చేయొచ్చు.

Updated Date - 2020-10-07T09:53:52+05:30 IST