రాజకీయ కురువృద్ధుడు.. పెన్మత్స కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-11T08:51:41+05:30 IST

రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూశారు.

రాజకీయ కురువృద్ధుడు.. పెన్మత్స కన్నుమూత

  • అనారోగ్యంతో చికిత్సపొందుతూ తుదిశ్వాస
  • ఉమ్మడి రాష్ట్రంలో 8 సార్లు ఎమ్మెల్యే
  • 1989-94 మధ్య కేబినెట్‌ మంత్రిగా సేవలు
  • ముఖ్యమంత్రి జగన్‌, చంద్రబాబు సంతాపం
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

నెల్లిమర్ల/విజయనగరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో సోమవారమే విజయనగరం జిల్లాలో పెనుమత్స స్వగ్రామం మొయిదలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ సహా ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు  హాజరయ్యారు. సాంబశివరాజుకు భార్య పద్మావతి, కుమారులు డాక్టర్‌ సూర్యనారాయణరాజు (సురేశ్‌బాబు), ప్రసాద్‌బాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె చిన్నప్పుడే మరణించగా.. మరో కుమార్తె రమాదేవి అమెరికాలో స్థిరపడ్డారు. సురేశ్‌బాబు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యే..

1933 ఆగస్టు 17న పెనుమత్ప జన్మించారు. కాంగ్రె్‌సలో ఆయనది చెరగని ముద్ర. మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహరావు, మాజీ సీఎంలు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలో 8 దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1989-94 మధ్య మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాల్లో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. 1967లో ఆయన తొలిసారి గజపతినగరం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత సతివాడ నియోజకవర్గానికి మారి.. 1978, 83, 85, 89, 99, 2004 ఎన్నికల్లో గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సతివాడ రద్దయి నెల్లిమర్లగా మారింది. 2009లో కాంగ్రెస్‌ టికెట్‌ లభించినా పోటీకి నిరాకరించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ముందుగా ఆ పార్టీలో చేరింది సాంబశివరాజే. జగన్‌ ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అన్నీ తానై వ్యవహించారు. 2019 ఎన్నికల్లో తనకో, తన కుమారుడికో టికెట్‌ ఇవ్వాలని పట్టుపట్టినా వైసీపీ నాయకత్వం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చినా నెరవేరలేదు.

Updated Date - 2020-08-11T08:51:41+05:30 IST