అర్హులందరికీ పింఛన్లు.. ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-02-08T08:27:15+05:30 IST

రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లు అందుతాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులందరికీ పింఛన్లు.. ఆందోళన వద్దు

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ సామాజిక పింఛన్లు అందుతాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నవశకం సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి అర్హతను నిర్ధారణ చేసుకుని ఈ నెలలో 54.68 లక్షల మందికి పెన్షన్‌ మంజూరుచేశామని తెలిపారు. సుమారు 87 శాతం పింఛన్లు ఫిబ్రవరి 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దనే గ్రామ/వార్డు వలంటీర్లతో పంపిణీ చేశామని తెలిపారు. కొత్తగా అర్హులైన 6.14 లక్షల మందికి కూడా పింఛన్లు అదేరోజు అందించామని పేర్కొన్నారు. సామాజిక పింఛను అర్హతలు నిర్ధారణ కాని 4.80 లక్షల మంది పింఛన్‌దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిని ఈ నెల8 నుంచి 17వ తేదీ లోపు పునఃపరిశీలిస్తామని తెలిపారు. వారిలో పింఛనుకు అర్హులైనట్లు తేలితే ఫిబ్రవరి పింఛను కూడా మార్చి పెన్షన్‌తో కలిపి ఇస్తామని వివరించారు. మున్సిపల్‌ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల వరకు నివాసం ఉన్న వారికి మినహాయింపునిచ్చి మంజూరుచేస్తామని తెలిపారు.

Updated Date - 2020-02-08T08:27:15+05:30 IST