పింఛను రాక ఆగిన పేద గుండె!
ABN , First Publish Date - 2020-02-08T10:18:00+05:30 IST
పింఛను నిలిచిపోయిందన్న ఆందోళనతో ఓ పేద గుండె ఆగిపోయింది.

రామాపురం, ఫిబ్రవరి 7: పింఛను నిలిచిపోయిందన్న ఆందోళనతో ఓ పేద గుండె ఆగిపోయింది. కడప జిల్లా రామాపురం మండలంలోని గోపగుడిపల్లె పంచాయతీ గాజులపేట గ్రామానికి చెందిన కత్తి రెడ్డెమ్మ (69)కు మూడేళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఇటీవల ఆమె పింఛనును నిలిపివేసింది. భర్త మూడేళ్ల క్రితం చనిపోయినందున తనకు వితంతు పింఛను లేదా వృద్ధాప్య పింఛను ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. మనస్తాపానికి గురైన ఆమె రెండురోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో శుక్రవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పింఛన్లు ఆగిపోయాయని ఎవరికీ చెప్పడం లేదని, ప్రస్తుతం రాకపోయి నా ఒకటి రెండు నెలల్లో వస్తాయని, ఒకేసారి మొత్తం డబ్బు ఇస్తామని చెబుతున్నామని ఎంపీడీవో నరసింహులు చెప్పారు.