పట్టించుకోని పాలకులుంటే శ్మశానానికైనా ఇలాగే వెళ్లాలి!
ABN , First Publish Date - 2020-09-01T09:30:11+05:30 IST
చనిపోయిన మనిషికి ఆఖరి సంస్కారాలు నిర్వహించడానికి అయినవారు పడుతున్న కష్టాలు చూశారా! కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామస్తుల పాట్లు ఇవి.

పాణ్యం: చనిపోయిన మనిషికి ఆఖరి సంస్కారాలు నిర్వహించడానికి అయినవారు పడుతున్న కష్టాలు చూశారా! కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామస్తుల పాట్లు ఇవి. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన విజయుడు అనే వ్యక్తి మృతిచెందాడు. దళితుల శ్మశాన వాటిక జుర్రాగు వాగు అవతల ఉంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బంధువులు మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దళితుల్లో ఎవరు మరణించినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. కానీ పనులు చేపట్టలేదు. కాగా, విజయుడు అంత్యక్రియలకు దళితులు పడ్డ ఇబ్బందులను గ్రామానికి చెందిన మాల మహానాడు నాయకులు కలెక్టర్ వీరపాండియన్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో నంద్యాల ఆర్డీవో తహసీల్దారు, ఎంపీడీవోతో కలిసి గ్రామానికి వెళ్లి దళితులతో చర్చించారు. నీరు తగ్గిన వెంటనే వంతెన పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.