పూర్తి జీతం ఇప్పించండి

ABN , First Publish Date - 2020-05-17T10:03:46+05:30 IST

కరోనాతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న జారీ చేసిన జీవో26ను సస్పెండ్‌ చేయాలని, మొత్తం జీతం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ..

పూర్తి జీతం ఇప్పించండి

  • ‘వాయిదాల’ జీవో నిలిపేయండి
  • హైకోర్టులో ఉద్యోగి పిటిషన్‌


అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న జారీ చేసిన జీవో26ను సస్పెండ్‌ చేయాలని, మొత్తం జీతం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయశాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. కరోనా నేపథ్యంలో ఐఏఎస్‌,  అఖిల భారత సర్వీసు అధికారుల జీతంలో 60, మిగిలిన ఉద్యోగులకు 50, నాల్గవ తరగతి ఉద్యోగులు తదితరులకు పది శాతం జీతంలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తగ్గించిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొంది.


ఈ జీవోను సవాల్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వై.లక్ష్మీనరసింహమూర్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మార్చి నెల నుంచి ఎలాంటి కోతలు లేకుండా మొత్తం జీతాన్ని ఇప్పించాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, 300(ఎ)లకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 

Updated Date - 2020-05-17T10:03:46+05:30 IST