ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం జరగపోతే..: పవన్

ABN , First Publish Date - 2020-05-19T00:19:13+05:30 IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించిందని జనసేన అధినేత

ఎల్జీ పాలిమర్స్  బాధితులకు న్యాయం జరగపోతే..: పవన్

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని ఆరోపించారు. స్టైరిన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, విష వాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని హెచ్చరించారు. లాక్‌డౌన్ అనంతరం ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రజల కోసం.. భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే ఉద్యమిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


ప్రభుత్వంలో ఉన్నవారు హుందాగా, పెద్ద మనసుతో ఉండాలని సూచించారు. విశాఖ జిల్లాకు చెందిన అనస్తీషియా వైద్యుడు సుధాకర్ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం వెళ్తాం అనుకొనేటప్పుడు ఆ చట్టం అందరికీ సమానంగానే పని చేయాలని డిమాండ్ చేశారు.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనూ, బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడారని గుర్తుచేశారు. ఆ పార్టీ వాళ్లు టీవీ చర్చల్లో నోరు పారేసుకున్నప్పుడు ఈ చట్టం ఎందుకు బలంగా పని చేయలేదని నిలదీశారు. కాకినాడలో ఓ ప్రజాప్రతినిధి ఇలాగే మాట్లాడితే నిరసన తెలిపిన జనసేన నాయకులపైనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. చట్టం బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా ప్రయోగించడం సరికాదని హితవు పలికారు.


సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కేవలం అధికారం కోసమే అలాంటి హామీలు ఇచ్చారనిపిస్తోందని విమర్శించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలోనూ ఈ విధమైన ఆశలు రేపి ప్రజలను మభ్యపెట్టకూడదని హితవు పలికారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చాయని అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ప్రజల సమస్యలపై బలంగా స్పందించాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. ప్రభుత్వ భూముల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలపై నాయకులందరూ చర్చించుకొని సమష్టిగా క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని శ్రేణులకు పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-19T00:19:13+05:30 IST