-
-
Home » Andhra Pradesh » Pawan with Nadda in Delhi
-
ఢిల్లీలో నడ్డాతో పవన్ ఏం మాట్లాడారంటే...
ABN , First Publish Date - 2020-11-26T00:00:54+05:30 IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఢిల్లీ వచ్చినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఢిల్లీ వచ్చినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్నది రెండ్రోజుల్లో తేలిపోతుందని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
అమరావతి, పోలవరంపై కూడా చర్చించాం...
అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు. గంట సేపు నడ్డాతో మాట్లాడినట్లు వివరించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి గురించి, దేవాలయాలపై దాడులు. లా అండ్ ఆర్డర్ గురించి కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

బైపోల్స్ కోసం ఢిల్లీ రాలేదు..
తిరుపతి ఉప ఎన్నిక కోసం ఢిల్లీ పర్యటన జరగలేదని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే ఈ పర్యటన జరిగిందని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో చర్చించామన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చలేరని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధానిగా ఉండాలనేదే జనసేన నిర్ణయం అని నాదెండ్ల తేల్చిచెప్పారు.