వంగపండు మృతి వార్త బాధించింది: పవన్

ABN , First Publish Date - 2020-08-04T22:12:42+05:30 IST

వంగపండు ప్రసాదరావు మృతి వార్త విని చాలా బాధ పడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వంగపండు ప్రసాదరావు మృతి నేపథ్యంలో స్పందించిన పవన్ మీడియాతో

వంగపండు మృతి వార్త బాధించింది: పవన్

అమరావతి: వంగపండు ప్రసాదరావు మృతి వార్త విని చాలా బాధ పడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వంగపండు ప్రసాదరావు మృతి నేపథ్యంలో స్పందించిన పవన్ మీడియాతో మాట్లాడారు. వంగపండు తన స్వరాన్ని భాస్వరంగా మార్చిన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఏపీలో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతోందని ఆగ్రహం, ఆవేదనతో రగిలిన సామాజిక వేత్త వంగపండు అని పేర్కొన్నారు. వంగపండు గారితో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం కనసాగుతోందని పవన్ చెప్పారు. 2009లో ప్రజారాజ్యం కోసం ఆయనతో కలిసి పని చేసిన సందర్భంలో అణగారిన, వెనుకబడిన వర్గాల గురించి ఆయన ఆలోచనలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని అన్నారు. జనసేన ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన విప్లవ నాయకులలో ఆయన కూడా ఒకరని అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా తనను కలిసి సంఘీభావం తెలిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారం.. రెండు వర్గాల చేతుల నుంచి అన్ని వర్గాలకు చేరిన నాడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని, అదే తన చిరకాల కోరికని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారని పవన్ పేర్కొన్నారు. ఆ కోరిక నెరవేరక ముందే మనల్ని వదిలి ఆయన వెళ్లిపోవడం విషాదకరం గద్గద స్వరంతో మాట్లాడారు. తన పాట ద్వారా తాడిత, పీడిత వర్గాల గుండె చప్పుళ్లను తన గళంతో ప్రపంచానికి వినిపించిన విప్లవ గాయకుడు వంగపండు అని చెప్పుకొచ్చారు. ఆ స్వరం అలసి సొలసి విశ్రమించింది కానీ ఆయన ఆశ, ఉత్తరాంధ్ర కొండ కోనల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వంగపండు చివరి వరకూ కష్టాలతోనే జీవన పయనం సాగించారన్నారు. విలువలతో సహ జీవనం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. ఆ విప్లవ గాయకునికి భారమైన మనస్సుతో నివాళులు అర్పిస్తున్నాని, ఆయన కుటుంబానికి తన తరపున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పవన్ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-08-04T22:12:42+05:30 IST