అప్పుడు ఎలా రోడ్లపైకి వచ్చారో..ఇప్పుడు కూడా రోడ్లపైకి రావాలి: పవన్

ABN , First Publish Date - 2020-02-13T00:21:12+05:30 IST

సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి రాజకీయాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

అప్పుడు ఎలా రోడ్లపైకి వచ్చారో..ఇప్పుడు కూడా రోడ్లపైకి రావాలి: పవన్

కర్నూలు: సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవడానికి రాజకీయాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దిశ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్‌లో జనాలు ఎలా రోడ్లపైకి వచ్చారో...ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్లపైకి వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. తప్పు చేసిన నిందితులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన చోట విద్యార్థినులపై అత్యాచారాలు జరిగితే సమాజం ఎటుపోతున్నట్టు అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతికి న్యాయం జరిగేవరకు పోరాడతాం, హెచ్చార్సీని ఆశ్రయిస్తామన్నారు. ఎస్టీ బాలికకు అన్యాయం జరిగిపోతే స్పందించని సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కర్నూలు జుడీషియల్‌ క్యాపిటల్‌ అంటున్నారు. క్యాపిటల్‌ సంగతి తర్వాత... ముందు సుగాలి ప్రీతికి న్యాయం చేయండి. సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే న్యాయ రాజధాని కట్టినా నిష్ప్రయోజనమన్నారు. రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగితే జగన్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. 


ప్రీతి కేసు సీబీఐ విచారణకు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. జగన్‌రెడ్డి ఎన్ని చట్టాలు తెచ్చినా...సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అవన్నీ వ్యర్థమని పవన్ పేర్కొన్నారు. ప్రీతికి న్యాయం చేయాలని డీజీపీకి, ఎస్పీని వేడుకుంటున్నానని తెలిపారు. బలహీనుల గొంతు విన్పించేందుకే జనసేన పెట్టామన్నారు. ఓటమి వచ్చినా, విజయం వచ్చినా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని పవన్ అన్నారు. సుగాలి ప్రీతి అంశాన్ని సామాన్యులే తెరపైకి తెచ్చారని తెలిపారు. ప్రజల్ని ముందుకు నడిపించే నాయకులే తమకు కావాలన్నారు. 

Updated Date - 2020-02-13T00:21:12+05:30 IST