నా నోరు మూయించాలని చూస్తే..భయపడను: పట్టాభి

ABN , First Publish Date - 2020-10-04T17:59:49+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తాను పదే పదే ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాననే..

నా నోరు మూయించాలని చూస్తే..భయపడను: పట్టాభి

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తాను పదే పదే ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాననే తనను టార్గేట్ చేసుకుని తన కారు ధ్వంసం చేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 108 కుంభకోణం, సరస్వతీ ఇండస్ట్రీస్‌లో జరిగిన అవినీతి గురించి బయటపెట్టానని, ఇంకా అనేక అంశాల్లో ప్రజల పక్షాన మాట్లాడుతున్నానన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు తనకిచ్చిన బహుమానమా? అని ప్రశ్నించారు. 


ప్రభుత్వం నిన్న విశాఖపట్టణంలో సబ్బం హరికి ఒక బహుమానం ఇచ్చిందని, ఇవాళ విజయవాడలో తనకిచ్చారని పట్టాభి అన్నారు. కొంతమంది పిరికిపందలు, దద్దమ్మలను తన ఇంటిపైకి పంపించి దాడి చేయించినంత మాత్రాన తాను మౌనంగా ఉండిపోతానని సీఎం జగన్ భ్రమలో ఉన్నారని.. పిరికిపంద చర్యలకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. నీతిగా, నిజాయితీగా బతుకుతున్నానని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే ప్రజల పక్షాన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పట్టాభి సవాల్ చేశారు. ఈ దాడి తనలో ఉన్న పట్టుదలను పది రెట్లు పెంచిందన్నారు.

Updated Date - 2020-10-04T17:59:49+05:30 IST