పరీక్షలు పాసైతేనే..

ABN , First Publish Date - 2020-05-09T09:41:53+05:30 IST

సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న గ్రేడ్‌-1 వీఆర్‌వోల పదోన్నతులకు లైన్‌క్లియర్‌ చేస్తూ రెవెన్యూశాఖ ఎట్టకేలకు విధాన నిర్ణయం తీసుకుంది.

పరీక్షలు పాసైతేనే..

గ్రేడ్‌-1 వీఆర్‌వోలకు సీనియర్‌ అసిస్టెంట్‌గా 

పదోన్నతులపై రెవెన్యూశాఖ విధాన నిర్ణయం


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న గ్రేడ్‌-1 వీఆర్‌వోల పదోన్నతులకు లైన్‌క్లియర్‌ చేస్తూ రెవెన్యూశాఖ ఎట్టకేలకు విధాన నిర్ణయం తీసుకుంది. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండటంతోపాటు, డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పాస్‌ అయిన వారికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టులకు, జిల్లాల్లో గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-1 వీఆర్‌వో)కి 60:40 శాతం నిష్పత్తిన సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, గ్రేడ్‌-1 వీఆర్‌వోలు పదోన్నతి పొందడానికి ముందు శాఖాపరమైన కొన్ని పరీక్షలు పాస్‌ అయ్యి తీరాలన్న నిబంధన విధించారు.


అంతేగాకుండా గ్రేడ్‌-1 వీఆర్‌వోలు తహసీల్దార్‌  కార్యాలయంలో కనీసం రెండేళ్లు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేయాలి. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే సీనియారిటీ ఆధారంగా పదోన్నతికి అర్హత సాధిస్తారు. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులో కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలి. నిర్దేశిత డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతోపాటుగా కంప్యూటర్‌ పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగి ఉండాలన్న నిబంధనలు విధించారు. 

Updated Date - 2020-05-09T09:41:53+05:30 IST