దేవతా శాంతి జరిగింది.. ఇక ప్రభుత్వానికి జరగాలి

ABN , First Publish Date - 2020-03-02T07:59:47+05:30 IST

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతామూర్తులపై జరుగుతున్న వరుస దాడుల నేపఽథ్యంలో విగ్రహాల ధ్వంసం జరిగిన పిఠాపురంలో దేవతామూర్తుల శాంతి జరిగింది.. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి దాని అధినేతలకు శాంతి ...

దేవతా శాంతి జరిగింది.. ఇక ప్రభుత్వానికి జరగాలి

  • పరిపూర్ణానంద సరస్వతి


పిఠాపురం, మార్చి 1: రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతామూర్తులపై జరుగుతున్న వరుస దాడుల నేపఽథ్యంలో విగ్రహాల ధ్వంసం జరిగిన పిఠాపురంలో దేవతామూర్తుల శాంతి జరిగింది.. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి దాని అధినేతలకు శాంతి జరగాలంటూ శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరులో మార్పు రాకుంటే ప్రజలే  తీర్పు చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.


ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి 151 సీట్లు ఇచ్చారని, రేపు కాషాయ పార్టీకి 175 సీట్లు ఇస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇటీవల 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో హైందవ సంఘాల ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో పిఠాపురంలోని పశువుల సంత ఆవరణలో  ఆదివారం సాయంత్రం సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం కేసు కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం తీర్పును గౌరవిద్దామని తెలిపారు.


ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి వారాలు గడుస్తున్నా నేటికి ఎటువంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తిరుమలలో అన్యమతస్థులను ఖాళీ చేయించాలని, విగ్రహాల ధ్వంసం ఘటనలో నిందితులను శిక్షించడంతో పాటు కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్‌తో త్వరలోనే తిరుపతి నుంచి దుర్గమ్మ గడప వరకు అక్కడ నుంచి అమరావతికి పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.


Updated Date - 2020-03-02T07:59:47+05:30 IST